కూటమిపై విమర్శల బాణాలు..
గుడివాడలో పార్టీ బలోపేతంపై నజర్
గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా, మౌనంగా ఉన్న గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు తన అలవాటు ప్రకారం ప్రజలను మోసం చేస్తున్నారని, హామీల అమలు ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తన వైఫల్యాన్ని ఒప్పుకోకుండా, ఆ నెపాన్ని బీజేపీ, జనసేన పార్టీల మీదకు నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని నాని ఎద్దేవా చేశారు.
వచ్చే 2029 ఎన్నికల ఫలితాలపై కొడాలి నాని ధీమా వ్యక్తం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024లో జగన్ చేసిన మంచిని ప్రజలు సరిగ్గా గుర్తించలేకపోయారని, కానీ 2029 నాటికి పరిస్థితి మారుతుందని జోస్యం చెప్పారు. మాట మీద నిలబడే నాయకుడు ఎవరో, ఇచ్చిన హామీలను నెరవేర్చే సత్తా ఉన్న నాయకుడు ఎవరో ప్రజలకు అప్పటికి అర్థమవుతుందని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు. జగన్ సీఎం కావడాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, కొడాలి నాని తన సొంత నియోజకవర్గం గుడివాడలో పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. మౌనం వీడిన తర్వాత ఆయన నియోజకవర్గంలోని స్థానిక నాయకత్వంతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. కార్యకర్తలను ఏకం చేస్తూ, స్థానికంగా పార్టీకి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా కొడాలి నాని వ్యూహాలు రచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
