
టీడీపీకి కొత్త లుక్ తెస్తున్న నారా లోకేశ్..
పేరుకే చంద్రబాబు…
అన్నీ తానై పార్టీని నడిపిస్తున్న లోకేష్
2029 ఎన్నికల నాటికి సన్నద్ధమవుతున్న లోకేష్…
నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం.. ఎన్నో గెలుపోటములు.. మరెన్నో చారిత్రాత్మక నిర్ణయాలకు వేదికైన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒక సరికొత్త మలుపు వద్ద నిలబడింది.
ఐదు దశాబ్దాల అపార రాజకీయ అనుభవం, వ్యూహరచనలో దిట్ట అయిన చంద్రబాబు నాయుడు ఒకవైపు ఉంటే..
ఆధునిక సాంకేతికతను ఒంటబట్టించుకుని, కార్యకర్తల నాడిని పట్టుకున్న దూకుడు స్వభావం గల యువ నాయకుడు నారా లోకేశ్ మరోవైపు పార్టీని నడిపిస్తున్నారు.
ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఒకే ఒక ప్రశ్న.. “తెలుగుదేశం పార్టీ సరికొత్తగా కనిపించబోతోందా? లోకేశ్ నాయకత్వంలో ఈ పసుపు జెండా కొత్త పుంతలు తొక్కబోతోందా?”
టెక్నాలజీతో ‘లోకేశ్’ మార్క్ పాలిటిక్స్
మంత్రి నారా లోకేశ్ ప్రవేశపెడుతున్న “టీడీపీ 3.0” వెర్షన్ కేవలం ఒక పేరు మాత్రమే కాదు, అదొక వ్యవస్థాగత మార్పు.
పార్టీలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన మధ్యవర్తుల వ్యవస్థకు చెక్ పెడుతూ, ‘మై టీడీపీ’ యాప్ ద్వారా కార్యకర్తలను నేరుగా అధిష్టానంతో అనుసంధానించడం ఒక విప్లవాత్మక నిర్ణయం. కార్యకర్తల అభిరుచులను, వారి కష్టాన్ని సాంకేతికతతో తూకం వేసి గుర్తింపునివ్వడం ద్వారా లోకేశ్ తనదైన ముద్ర వేస్తున్నారు.
పార్టీని ఒక ‘పొలిటికల్ యూనివర్సిటీ’గా మార్చి, ఏడాదికి 300 రోజులు శిక్షణా తరగతులు నిర్వహించాలన్న ఆయన లక్ష్యం, రాబోయే తరానికి తెలుగుదేశం ఒక గట్టి పునాది అని చాటిచెబుతోంది.
వారసత్వమా.. వ్యవస్థాగత రక్షణ కవచమా?
అయితే, ఈ పరిణామాల వెనుక మరో ఆసక్తికరమైన చర్చ కూడా నడుస్తోంది.
పార్టీలో తాను అత్యంత కీలకం అన్న రీతిలో లోకేశ్ వ్యవహరిస్తుండటం, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని ‘నారా’ వారి కుటుంబమే నడిపిస్తుందనే బలమైన సంకేతాలను ఇస్తున్నారా అనే కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి.
“దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి” అన్న సామెత చందంగా, గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు జైలుకెళ్లినప్పుడు పార్టీ ఎదుర్కొన్న తీవ్రమైన ఇబ్బందులను లోకేశ్ ప్రత్యక్షంగా చూశారు.
ఆ గడ్డు పరిస్థితుల్లో నాయకత్వ లేమి ఎంతటి ప్రమాదకరమో అర్థం చేసుకున్న ఆయన, రాబోయే రోజుల్లో ఎలాంటి సవాళ్లు ఎదురైనా, ఏ స్థాయి నాయకుడు అందుబాటులో లేకపోయినా పార్టీ కుప్పకూలిపోకుండా నిలదొక్కుకోవాలని భావిస్తున్నారు.
అందుకే, కేవలం ఒక వ్యక్తిపై ఆధారపడకుండా వ్యవస్థాగతంగా కార్యకర్తలను, పార్టీని యుద్ధానికి సిద్ధమైన సైన్యంలా తయారు చేస్తున్నారు. ఇది ఒక రకంగా వారసత్వ నాయకత్వాన్ని బలపరుచుకోవడమే కాకుండా, పార్టీకి ఒక పటిష్టమైన రక్షణ కవచాన్ని నిర్మించుకోవడంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
2027 నాటికి ‘లోకేశ్ అంటేనే టీడీపీ’గా మారబోతోందా?
రానున్న మున్సిపల్, పంచాయతీ మరియు స్థానిక సంస్థల ఎన్నికలే లోకేశ్ తెస్తున్న ఈ మార్పుకు మొదటి పరీక్ష కాబోతున్నాయి. “కార్యకర్తే అధినేత” అనే నినాదంతో క్షేత్రస్థాయిలో ఆయన చేస్తున్న ప్రయోగాలు సత్ఫలితాలనిస్తే.. పార్టీలో “ముఖ్య నాయకుడు” అనే స్థాయి నుంచి “పార్టీ అంటే లోకేశ్.. లోకేశ్ అంటే పార్టీ” అనే స్థితికి ఆయన ఎదుగుతారనడంలో సందేహం లేదు.
చంద్రబాబు నాయుడు పాలనపై దృష్టి సారిస్తుంటే, లోకేశ్ పార్టీ యంత్రాంగాన్ని పరుగులెత్తిస్తూ కేడర్లో కొత్త జోష్ నింపుతున్నారు.
అహంకారానికి తావు లేకుండా, ప్రతి బూత్ స్థాయిలోనూ పార్టీని బలోపేతం చేయడం ద్వారా 2027 నాటికి తెలుగుదేశం పార్టీని ఒక అజేయమైన శక్తిగా మార్చాలని ఆయన కంకణం కట్టుకున్నారు.
2027 చివరి నాటికి అధికారికంగా చంద్రబాబు నాయుడు నుండి పార్టీ పగ్గాలు నారా లోకేష్ చేపట్టే అవకాశాలు అనిపిస్తున్నాయి.
2029 ఎన్నికలకు చంద్రబాబు నాయుడు వయసు 80 సంవత్సరాల దాటే అవకాశం ఉండడంతో తెలుగుదేశం పార్టీకి అన్ని తామే ముందుకు నడిపిస్తూ పార్టీ అధ్యక్షుడైన… సీఎం అయినా… చంద్రబాబు నాయుడు తర్వాత ఆ స్థానంలో నారా లోకేష్ పేరే వినపడేలా వ్యూహాత్మకంగా నారా లోకేష్ అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
యువగళం పాదయాత్రతో ప్రజల మనసు గెలుచుకున్న లోకేశ్, ఇప్పుడు వ్యవస్థాగత సంస్కరణలతో పార్టీ రూపురేఖలను మారుస్తున్నారు. అధికార గర్వం తలకెక్కకూడదని, ప్రజలే సుప్రీం అని ఆయన పదే పదే చెప్పడం ఆయన రాజకీయ పరిణతికి నిదర్శనం.
ఒకవైపు అనుభవం, మరోవైపు ఆధునికత కలగలిసి సాగుతున్న ఈ ప్రయాణం తెలుగు జాతిని మరోమారు రాజకీయంగా చైతన్యవంతం చేయబోతోందా? లోకేశ్ నాయకత్వంలో టిడిపి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వేయించి చూడాలి.