
రాజకీయాల్లో అతి త్వరలో ఒక చారిత్రాత్మక మార్పు రాబోతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ (మహిళా రిజర్వేషన్ బిల్లు) అమలులోకి వస్తే, రాష్ట్ర అసెంబ్లీ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. 175 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 33 శాతం కోటా ప్రకారం దాదాపు 58 స్థానాలు మహిళలకే కేటాయించాల్సి ఉంటుంది.
కేవలం సంఖ్య పరంగానే కాకుండా, ఓటర్ల బలాన్ని బట్టి చూస్తే రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా ఎదిగారు. దీనిపై ప్రత్యేక విశ్లేషణ మీకోసం:
మహిళలకు రాజ్యాధికారం… మారనున్న రాజకీయ తలరాతలు
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాను పరిశీలిస్తే, పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలే మెజారిటీగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భీమిలి నియోజకవర్గం 1,65,570 మంది మహిళా ఓటర్లతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ గణాంకాలు కేవలం అంకెలు మాత్రమే కావు…
రాబోయే రోజుల్లో ఇక్కడ పురుష నాయకుల ఆధిపత్యానికి బ్రేక్ పడి, మహిళా నాయకత్వం బలపడటానికి ఇవి పునాదులు. పాణ్యం, గాజువాక, చంద్రగిరి వంటి కీలక నియోజకవర్గాల్లో 1.5 లక్షలకు పైగా మహిళా ఓటర్లు ఉండటం గమనార్హం.
ఈ రిజర్వేషన్లు అమలులోకి వస్తే, దశాబ్దాలుగా నియోజకవర్గాలను ఏలుతున్న ‘పొలిటికల్ హేమాహేమీల’ సీట్లకు ఎసరు పడటం ఖాయం. కోవూరు, కర్నూలు, విజయవాడ ఈస్ట్, సెంట్రల్ వంటి స్థానాల్లో బలమైన పురుష నేతలు ఉన్నప్పటికీ, రిజర్వేషన్ల లాటరీలో ఆ సీట్లు మహిళలకు దక్కితే, వారు తమ భార్యలనో లేదా వారసురాళ్లనో రంగంలోకి దించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కొత్త రక్తాన్ని రాజకీయాల్లోకి తెచ్చినా, క్షేత్రస్థాయిలో పాత నాయకుల పట్టు సడలేలా చేస్తుంది.
సమీకరణాల మార్పు – సామాజిక విశ్లేషణ
ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కూడా మహిళా కోటా అమలు కానుంది. ఉదాహరణకు రంపచోడవరం (ST) లో 1.40 లక్షల మంది, చింతలపూడి (SC) లో 1.32 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ సామాజిక రిజర్వేషన్ తో పాటు మహిళా రిజర్వేషన్ తోడైతే, అట్టడుగు వర్గాల మహిళలకు చట్టసభల్లో గొప్ప అవకాశం లభిస్తుంది.
అయితే, ఈ మార్పు అంత సులభంగా జరగదు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఈ బిల్లు పూర్తిస్థాయిలో అమలు కానుంది. అప్పటికి ఏ ఏ సీట్లు మహిళలకు కేటాయిస్తారో అనే ఉత్కంఠ ఇప్పటి నుంచే నాయకుల్లో మొదలైంది. ముఖ్యంగా గన్నవరం, మైలవరం, తెనాలి, నంద్యాల వంటి రాజకీయంగా అత్యంత వేడి ఉన్న ప్రాంతాల్లో మహిళా రిజర్వేషన్ వస్తే, అక్కడి వర్గపోరు కూడా తగ్గుముఖం పట్టి, మహిళా సాధికారత వైపు అడుగులు పడే అవకాశం ఉంది.
హింసకు చెక్.. అభివృద్ధికి బాట…
గత ఎన్నికల్లో మాచర్ల, వినుకొండ, గురజాల వంటి నియోజకవర్గాల్లో రాజకీయ హింస చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మహిళా రిజర్వేషన్ల వల్ల రాజకీయాల్లో సున్నితత్వం పెరుగుతుందని, ఫ్యాక్షన్ మరియు గొడవలకు తావు లేకుండా అభివృద్ధి అజెండా ప్రాధాన్యత సంతరించుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట సంక్షేమ పథకాలు, కుటుంబ భద్రత వంటి అంశాలే గెలుపోటములను శాసిస్తాయి.
మొత్తానికి 1.20 లక్షల కంటే ఎక్కువ మహిళా ఓటర్లు ఉన్న సుమారు 50కి పైగా నియోజకవర్గాల జాబితా, ఏపీ రాజకీయాల్లో రాబోయే ‘మహిళా శకం’కి సంకేతం. భీమిలి నుంచి తాడిపత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఓటు బ్యాంకుగా మాత్రమే కాకుండా, రేపటి శాసనకర్తలుగా మారబోతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక నిశ్శబ్ద విప్లవానికి నాంది కానుంది.
ఏపీ అసెంబ్లీలో మహిళలకు దక్కే నియోజక వర్గాలివే….?
1,65,570 మంది మహిళలతో భీమిలి నియోజకవర్గం మొదటిస్థానంలో నిలిచింది.
పాణ్యం (1,54,460),
గాజువాక (1,53,505),
చంద్రగిరి (1,47,522),
తిరుపతి (1,44,295),
మంగళగిరి (1,41,514),
పెనమలూరు (1,40,953),
రంపచోడవరం (ఎస్టీ) (1,40,090),
పెందుర్తి (1,39,430),
గురజాల (1,38,055),
విశాఖపట్నం నార్త్ (1,37,949),
కోవూరు (1,37,063) ,
కర్నూలు (1,36,672),
విజయవాడ ఈస్ట్ (1,35,996),
విజయవాడ సెంట్రల్ (1,35,763),
గుంటూరు వెస్ట్ (1,35,311)…
గన్నవరం (1,34,847),
మైలవరం (1,34,785),
నెల్లూరు రూరల్ (1,34,323),
తెనాలి (1,33,452),
నంద్యాల (1,32,924),
అనంతపురం అర్బన్ (1,32,802),
ఇచ్ఛాపురం (1,32,642),
కడప (1,32,431),
శ్రీకాకుళం (1,32,230),
చింతలపూడి (ఎస్సీ) (1,32,182),
రాజమహేంద్రవరం సిటీ (1,31,734),
ప్రత్తిపాడు (ఎస్సీ) (1,31,487),
రాజమహేంద్రవరం రూరల్ (1,31,483),
గుంతకల్లు (1,31,306),
కాకినాడ సిటీ (1,30,741),
పలమనేరు (1,30,413),
విశాఖపట్నం ఈస్ట్ (1,29,946)
మాచర్ల (1,28,886),
వినుకొండ (1,28,401),
కాకినాడ రూరల్ (1,27,787),
భీమవరం (1,27,590),
రాయదుర్గం (1,27,358),
మదనపల్లె (1,26,729),
పోలవరం (ఎస్టీ) (1,25,235),
కావలి (1,25,184),
జమ్మలమడుగు (1,25,158),
కొత్తపేట (1,24,901),
పాయకరావుపేట (ఎస్సీ) (1,24,703),
శ్రీకాళహస్తి (1,23,723),
ప్రొద్దుటూరు (1,23,509),
ఆదోని (1,23,311),
విజయనగరం (1,22,966),
రాయచోటి (1,22,679),
కదిరి(1,22,542), రాప్తాడు (1,22, 296), ఆలూరు (1,22,036), గుంటూరు ఈస్ట్ (1,21,756),
విజయవాడ వెస్ట్ (1,21,677),
గూడూరు (ఎస్సీ) (1,21,523),
ఒంగోలు (1,20,838),
బనగానపల్లె (1,20,626),
తాడిపత్రి 1,19,334 మంది మహిళలున్నారు.
పై దామాషా ప్రకారం 33 శాతం మహిళా బిల్లు, సీట్లు పెంపు తో ఆయా సామాజిక వర్గాల వారీగా నియోజకవర్గాల రాజకీయ సమీకరణలు పూర్తిస్థాయిలో మారే అవకాశంలో కనిపిస్తుంది.