
జనసేన “సుభాషితాలు”…!
ఆదర్శాల బాటలోనా.. అపమార్గం వైపునా?
జనసేన పార్టీ ఆవిర్భావ సమయంలో పవన్ కళ్యాణ్ పలికిన సిద్ధాంతాలు, ఆదర్శాలు వినడానికి ‘సుభాషితాల’ వలె ఎంతో చక్కగా ఉండేవి.
కానీ, నేడు క్షేత్రస్థాయిలో ఆ పార్టీ నాయకులు ప్రదర్శిస్తున్న తీరు, పలికే మాటలు చూస్తుంటే ఆ ఆదర్శాలకు, వాస్తవాలకు పొంతన లేదన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో వెల్లువెత్తుతున్నాయి. “ప్రశ్నిస్తాం” అని గర్జించిన గొంతుకలు, నేడు వ్యక్తిగత దూషణలకు, నైతిక విలువల పతనానికి వేదికగా మారుతున్నాయన్న చర్చ సాగుతోంది.
విలువల విస్మరణ…అరవ శ్రీధర్ వివాదం…
రాజకీయాల్లో నైతికత గురించి మాట్లాడే జనసేనలో, నేడు చేరుతున్న నేతల నేపథ్యం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. అరవ శ్రీధర్ వంటి వారిపై ఒక మహిళా ఉద్యోగిని పెళ్లి పేరుతో మోసం చేశారని బహిరంగంగా ఆరోపించినా, పార్టీ నాయకత్వం మౌనం వహించడం విస్మయానికి గురిచేస్తోంది. బాధితురాలి ఆవేదనను పట్టించుకోకుండా, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం “విలువల రాజకీయం” అనే మాటకు విరుద్ధంగా కనిపిస్తోంది. సిద్ధాంతాల కంటే కేవలం సంఖ్యా బలమే ముఖ్యం అనే ధోరణి ఇక్కడ స్పష్టమవుతోంది.
నోటి దురుసు.. రాజకీయ దిగజారుడుతనం
జనసేన నాయకురాలు సుభాషిణి ఇటీవల వైసీపీ అధినేత సతీమణి వైఎస్ భారతిపై చేసిన వ్యాఖ్యలు ‘సుభాషితాలు’ కావు సదా, రాజకీయ కలుషితాలుగా మారుతున్నాయి. రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం లేని ఒక మహిళను ఉద్దేశించి “అడ్డగాడిద” వంటి నీచమైన పదజాలం వాడటం, బహిరంగంగా సవాలు విసరడం చూస్తుంటే పార్టీ ఏ దిశగా వెళ్తోందో అర్థమవుతోంది. ఒక పక్క సంస్కారం గురించి మాట్లాడుతూనే, మరోపక్క ఇష్టానుసారంగా మాట్లాడే నేతలకు పెద్దపీట వేయడం వల్ల జనసేన తన అసలు మార్గాన్ని తప్పి, సంప్రదాయ మురికి రాజకీయాల వైపు అడుగులు వేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.
అధినేత బాటలోనే అడుగులు?
నాయకుడి బాటలోనే కార్యకర్తలు నడుస్తారనేది జగమెరిగిన సత్యం. గతంలో సాక్షాత్తు పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో ప్రత్యర్థులను ఉద్దేశించి “గుడ్డలూడదీసి కొడతాం” అని అనడం, చెప్పు చూపిస్తూ హెచ్చరించడం వంటివి ఆయనలోని రాజకీయ పరిణతిని అప్పట్లోనే ప్రశ్నార్థకం చేశాయి. నేడు అదే బాటలో కిందిస్థాయి నేతలు కూడా హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. కార్యకర్తలు ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పోరాడుతుంటే, వివాదాస్పద వ్యక్తులు వచ్చి పదవులు దక్కించుకోవడం జనసేన అంతర్గత పతనానికి నాంది పలుకుతోంది.
ప్రజల్లో గౌరవం, ఆదరణ పొందాలంటే…
ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న పవన్ కళ్యాణ్ పార్టీ లో ఇలాంటి అడ్డు అదుపు లేని వ్యాఖ్యలు, నైతికత లేని చేరికలు కొనసాగితే, జనసేన పార్టీపై ప్రజలకు ఉన్న గౌరవం, మర్యాద క్రమంగా తగ్గడం ఖాయం.
పవన్ కళ్యాణ్ ఈ విమర్శలను పట్టించుకోకుండా మౌనంగా ఉండటం ఆ దిగజారుడుతనానికి మరింత ఊతమిస్తోంది.
సిద్ధాంతాలు పుస్తకాలకే పరిమితమై, ఆచరణలో మురికి రాజకీయాలే రాజ్యమేలితే “జనసేన సుభాషితాలు” కేవలం విమర్శలకే పరిమితమవుతాయి.
ఇప్పటికైనా పార్టీ నేతలు తమ మాటలు అదుపులో పెట్టుకొనేలా, ప్రజల్లో విశ్వాసం కలిగేలా గౌరవ ప్రార్ధమైన రాజకీయాలు జనసేన పార్టీ కి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి శ్రేయస్కరం… అదుపు చేయకుంటే… మహా ప్రమాద కరం…!!!
పక్క పార్టీ వాళ్ళు మాట్లాడటం లేదా అని ప్రశ్నించే జనసైనికులు… వాళ్ళు ఇంతలా దిగజార లేదు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని…’జనసేన”కి ఉన్న గౌరవాన్ని కాపాడుకోవటం మంచిది.