
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మధ్య జరుగుతున్న ఈ వివాదం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అద్దంకి నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అత్యంత ఘాటుగా స్పందించారు. “చంద్రబాబును కించపరిస్తే.. మేము బాడీ షేమింగ్ చేయాల్సి ఉంటుంది.
ఒక్క మాటతో నిన్ను చంపేయగలను. కానీ, నాకు సంస్కారం ఉంది” అని జగన్‌ను ఉద్దేశించి పెమ్మసాని హెచ్చరించారు. వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని, జగన్ తన మైండ్‌సెట్ మార్చుకోవాలని ఆయన నిలదీశారు.
పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు పెమ్మసాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కౌంటర్ ఇచ్చారు. “చంపేస్తానని బెదిరించడమే పెమ్మసాని నేర్చుకున్న సంస్కారమా?” అని అంబటి ప్రశ్నించారు. ఒక బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి, అమెరికాలో డాక్టరుగా పనిచేసిన వ్యక్తి ఇలా ఫ్యాక్షనిస్టులా మాట్లాడటం ఆయన స్థాయికి తగదని ఎద్దేవా చేశారు. అధికారం ఉందన్న అహంకారంతో ఇలాంటి హింసాత్మక వ్యాఖ్యలు చేయడం అప్రజాస్వామికమని, ఇలాంటి బెదిరింపులకు వైఎస్ జగన్ గానీ, వైసీపీ కార్యకర్తలు గానీ భయపడబోరని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
అంబటితో పాటు ఇతర వైసీపీ కీలక నేతలు కూడా పెమ్మసానిపై విమర్శల దాడిని కొనసాగించారు. పేర్ని నాని స్పందిస్తూ, పెమ్మసాని భాష ఒక ఫ్యాక్షనిస్టు కంటే దారుణంగా ఉందని, జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రాణహాని తలపెడతామని మాట్లాడటం సంస్కారం అనిపించుకోదని హితవు పలికారు. మరోవైపు కొడాలి నాని తనదైన శైలిలో విరుచుకుపడుతూ, ఢిల్లీలో పదవి ఉంది కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారని, దమ్ముంటే మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఒప్పందాలు ఎప్పుడు జరిగాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాడీ షేమింగ్ గురించి మాట్లాడే హక్కు టీడీపీ నేతలకు లేదని, గతంలో జగన్‌ను వ్యక్తిగతంగా దూషించినప్పుడు ఈ సంస్కారం ఏమైందని వారు ప్రశ్నించారు.
అసలు చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే….
చంద్రబాబు పాలన అంతా వైఫల్యమని, ఆయన చేసేవన్నీ మాటలే తప్ప చేతలుండవని విమర్శించారు. చంద్రబాబు ప్రస్తుతం చేస్తున్నది “క్రెడిట్ చోరీ” కాదని, అది “క్రెడిట్ దోపిడీ” అని జగన్ మండిపడ్డారు. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ను తానే తెచ్చినట్లు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారని, కానీ నిజానికి 2022లో తాను దావోస్‌లో ఆదిత్య మిట్టల్‌ను కలిసినప్పుడే ఈ ప్రాజెక్టుపై ఒప్పందాలు జరిగాయని గుర్తు చేశారు. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కును 13 రాష్ట్రాలతో పోటీ పడి తమ హయాంలోనే తెచ్చామని, కానీ చంద్రబాబు వచ్చాక ఆ పనులు ముందుకు సాగడం లేదని జగన్ ఆరోపించారు. అసలు మిట్టల్ లాంటి పెట్టుబడిదారులు చంద్రబాబు “ముఖారవిందాన్ని” చూసి రాష్ట్రానికి వస్తున్నట్లు బిల్డప్ ఇవ్వడం విడ్డూరంగా ఉందని జగన్ ఎద్దేవా చేశారు.