
- బీహార్లో చక్రం తిప్పిన మోడీ-అమిత్ షా
- రాజ్యసభకు సతీష్ కుమార్
- కేంద్రమంత్రి పదవి దక్కే ఛాన్స్ …?
- ఏపీ రాజకీయాలపై కూడా మోడీ దృష్టి పెట్టారా..
- అధికార పగ్గాలు ఇప్పుడే ఎందుకు మార్చాలి…
- పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి పదవిపై ఆశ లేదా..?
దేశంలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీహార్ రాష్ట్రంలో వరుసగా పది పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేసిన రాజకీయ చాణక్యుడు నితీష్ కుమార్ను గద్దె దింపి, రాజ్యసభకు ఆ తదుపరి కేంద్ర మంత్రి పదవి కట్టబెటలని కేంద్ర పెద్దలు పక్కా వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు.
బీహార్ లో అధికార మార్పిడిని విజయవంతంగా పూర్తి చేస్తున్న ప్రధాని మోదీ అమిత్ షా ద్వయం ఇప్పుడు ఏపీ రాజకీయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారా అంటే అవునని సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా భేటీ అయ్యారు.

ఈ భేటీ అయిన తర్వాత బీహార్లో నితీష్ కుమార్ మార్పు అంశం తెర మీదకు వచ్చింది. అయితే ఇప్పుడు ఏపీలో ఏం జరగబోతుంది అన్నది సర్వత్ర చర్చనీయాంశం గా మారింది.
బిజెపి నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి భవితవ్యం దృష్టిలో ఉంచుకొని తమ మిత్రపక్షాలైన ఆయా ప్రాంతీయ పార్టీల రాజకీయ సొంత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుంది.
అంతిమంగా ఎన్డీఏ కూటమి 10 కాలాలపాటు దేశాన్ని పాలించడమే లక్ష్యమైనప్పటికీ ఆయా రాష్ట్రాల్లో మోదీ అమిత్ షాలు అమలు చేస్తున్న వ్యూహాత్మక ఎత్తుగడలు భవిష్యత్తు రాజకీయ వ్యూహాలకు అద్దం పడుతున్నాయి.

బీహార్ లో అధికార మార్పిడి ద్వారా బిజెపి అందించిన స్పష్టమైన సంకేతం ఏమిటంటే… నితీష్ కుమార్ వయోభారంతో మరో నాలుగున్నర ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేస్తే ఆ రాష్ట్రంలో కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. పైగా నితీష్ కుమార్ తరువాత ఎం డి ఏ పక్షాలకు ప్రాతినిధ్యం వహించే బలమైన నాయకుడు వచ్చే ఎన్నికలకు లేకుండా పోతాడు. అందుకనే బిజెపి అగ్రనాయకత్వం నితీష్ కుమార్ ను కేంద్రంలోకి తీసుకోవడం ద్వారా బీహార్లో భవిష్యత్తు యువనాయకత్వాన్ని తయారు చేసుకునే పనిలో పడింది. అందులో భాగంగా ఇప్పటివరకు రాజకీయాలకు దూరంగా ఉన్న నితీష్ కుమార్ తనయుడిని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి అతనికి ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి, ముఖ్యమంత్రి పదవిని బిజెపి కైవసం చేసుకుంటుంది. తద్వారా బిజెపి అధికారాన్ని చేపట్టడంతో పాటు బీహార్ రాష్ట్రంలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించి బిజెపి ఆర్ జె డి పార్టీలకు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది.
సరిగ్గా ఇప్పుడు ఇదే ఫార్ములా అమలు చేసేందుకు మోడీ అమిత్ షాలు సిద్ధమైనట్లుగా సమాచారం.
ఇప్పటికీ 75 సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల నాటికి వయసు సహకరించని పరిస్థితి ఏర్పడవచ్చు. చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యవహార శైలి దృష్ట్యా తానే దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండాలి అనే వ్యక్తిత్వం కనిపిస్తుంది. తన కుమారుడు మంత్రిగా మాత్రమే పనిచేస్తున్నాడు. ఇప్పుడు మోదీ అమిత్ షాలు చంద్రబాబు నాయుడుతో సంప్రదింపులు జరిపి బీహార్ తరహాలో ఏపీలోనూ అధికార మార్పిడి చేపట్టాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఏపీలో చంద్రబాబు నాయుడు స్థానంలో ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించడం ద్వారా తాము అనుకున్న అధికార మార్పిడి వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ను ఉపరాష్ట్రపతి లేదా ఉపముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టి ఆయనకు ఎక్కడా తాము ప్రాధాన్యత తగ్గించలేదని జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రభావం మరింత పెరుగుతుందని చంద్రబాబును ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. పైగా తాము చేస్తున్న ఈ ప్రయోగంలో ముఖ్యమంత్రి పీఠంలో నారా లోకేష్ నే ఎంపిక చేస్తున్నందున చంద్రబాబు నాయుడుకు పెద్దగా అభ్యంతరాలు ఉండకపోగా, తనంతట తాను సీఎం కుర్చీని చినబాబుకు అప్పగిస్తే పార్టీలో వచ్చే వ్యతిరేకత, పొరపచ్చాలు, అంతర్గత విభేదాలు భవిష్యత్తులో ఆటంకంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార మార్పిడి జరిగితే విజయవంతం అవుతుందన్నది బాబు వ్యూహంగా కనిపిస్తుంది. అందుకే కేంద్ర పెద్దలు సూచించిన విధముగా అతి త్వరలోనే చంద్రబాబు నాయుడు తన స్థానంలో తన కుమారుడు నారా లోకేష్ ను చూసుకునే అవకాశం లేకపోలేదు.
నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అని కాపు సామాజిక వర్గం నుండి వినిపిస్తున్న ప్రశ్న. వాస్తవానికి ముఖ్యమంత్రి పీఠం దక్కడానికి కావాల్సిన ఎమ్మెల్యే స్థానాలు గాని, ముఖ్యమంత్రిగా పని చేసే అనుభవంగాని పవన్ కళ్యాణ్ కు లేదు. పవన్ కళ్యాణ్ కూడా తాను ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పకపోగా, భవిష్యత్తులో ఆలోచిద్దామని చెప్పడం పవన్ కళ్యాణ్ వైఖరికి అద్దం పడుతుంది. తాను ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలి అనుకున్న చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మద్దతు లేకుండా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాలేరు. ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు నాయుడు కుటుంబం చేతుల్లో ఉంది కాబట్టి ఆ పదవి లోకేష్ కి ఇవ్వడమే మంచిదన్న భావన పవన్ కళ్యాణ్ లో ఉంది.
లోకేష్ సీఎం అయితే తాను ఉప ముఖ్యమంత్రిగా ఉండడం తన అభిమానులు కార్యకర్తలు నాయకులు అంగీకరించని పక్షంలో తాను కూడా కేంద్రంలో సహాయ మంత్రి లేదా మంత్రి శాఖను కోరి కేంద్రానికి వెళ్లే ఆలోచన చేయవచ్చు. లేదా లోకేష్ కు మద్దతుగా నిలుస్తూ కీలకమైన మంత్రి పదవులు తీసుకుని లోకేష్ కు సమానంగా అనుభవాన్ని కూడగట్టే అవకాశం ఉండవచ్చు.
కేంద్ర పెద్దల మద్దతు తనకు ఎప్పుడూ ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో వారి సహకారంతో పార్టీ బలోపేతం చేసుకుని ఆ తదుపరి ముఖ్యమంత్రి పదవిపై దృష్టి సాధించాలన్నది పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహంగా కనిపిస్తుంది.
ఏపీలో అధికార పగ్గాలు యువనాయకత్వానికి అప్పగించడం ద్వారా రాబోయే ఎన్నికల్లో బలమైన నాయకత్వాన్ని రూపొందించుకోవడంతోపాటు ఎన్డీఏ కూటమి పక్షాలకు ధోకా లేకుండా చేయాలి అన్నది మోడీ షా ద్వయం వ్యూహంగా కనిపిస్తుంది.
అతి త్వరలో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో కేంద్రంలో చంద్రబాబు నాయుడు కీలకపాత్ర పోషించనున్నారా, చినబాబు సీఎం కుర్చీలో కనిపించబోతున్నారా అన్నది వేచి చూడాలి.
.