తెలుగు రాజకీయాల్లో ఒక సంచలనం తెలుగుదేశం పార్టీ అని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురష్కరించుకుని మండల కేంద్రంలో ఆదివారం పెద్దఎత్తున జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా పార్టీ శ్రేణులు ఎడ్లబండిపై ఎక్కించి, డిజే మోతలు నడుమ ఆయనకు ఘన స్వాగతం పలికారు.
భారీ వాహన శ్రేణి నడుమ ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ తీశారు. అనంతరం అక్కడున్న స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి, ఘనంగా నివాళులర్పించారు జూలకంటి. జెండాను ఆవిష్కరించి, భారీ కేక్ కట్ చేసి, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం స్వర్గీయ ఎన్టీఆర్ ఎత్తిన జెండా, దేశ రాజకీయాల్లో చరిత్రను తిరగరాసిందన్నారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి, అన్నీ వర్గాల వారికి సమాన హక్కులను కల్పించిన ఘనత ఎన్టీఆర్ దే అన్నారు.
ఆయన వేసిన బీజానికి దార్శనికులైన చంద్రబాబు ప్రాణం పోశారని, నేడు మహావృక్షంలా మారిన టీడీపీ తెలుగు ప్రజలకు మంచి ఫలాలను అందిస్తోందని పునరుద్ఘాటించారు. పార్టీ సాధించిన విజయాలను ప్రజల విజయాలుగా భావించి, అన్నీ రంగాలను అభివృద్ధి పథంలో చంద్రబాబు,లోకేష్ ముందుకు తీసుకుపోతున్నామని వివరించారు.
కార్యకర్తల త్యాగాల పునాదులపై నిర్మించిన పార్టీ టీడీపీ అని, రాజకీయ చరిత్ర పుటాల్లో ఈ రోజు మరవనది అని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.