అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు బాధితురాలు హర్ష వీణ మధ్య సాగుతున్న ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలో మారి… ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్టు… ఎమ్మెల్యే శ్రీధర్ వ్యవహారం పై అందరి వేళ్ళు జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైపు చూపుతున్నాయి.
ప్రతిపక్షంలో ఉండగా 30 వేల మంది మహిళలు రాష్ట్రంలో కనిపించకుండా పోయారని పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు గతంలో తీవ్ర సంచలనమయ్యాయి. తాము అధికారంలోకి వస్తే మహిళల రక్షణకు పెద్దపేట వేస్తామని, మహిళల జోలికొస్తే తాట తీస్తామని ప్రగల్బాలు పలికిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక ఆ మాటలు మర్చిపోయారా… తమ ఎమ్మెల్యే కాబట్టి.. తాను చెప్పిన నీతులన్నీ ఇక్కడ వర్తించవు అన్న సంకేతాలు ఇస్తున్నారా..? అంటూ మహిళలు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తాజాగా బాధితురాలు వీణ.. అరవ శ్రీధర్ వ్యవహారంలో న్యాయం చేయకపోతే ఆత్మహత్యకు పాల్పడతానని, అందుకు పవన్ కళ్యాణ్ ని బాధ్యత వహించాలని హెచ్చరించడం తో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయ అంశం అవుతుంది.
కూటమి ప్రభుత్వానికి సవాలుగా మారిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే వివాదం…
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగి చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుదుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యవహారం కేవలం ఒక వ్యక్తిగత వివాదంలా కాకుండా, కూటమి ప్రభుత్వ నైతికతపై ప్రశ్నలు లేవనెత్తేలా మారుతోంది.
బాధితురాలు తీవ్ర ఆరోపణలు…
బాధితురాలు హర్ష వీణ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉద్యోగ సంబంధిత సహాయం కోసం తాను ఎమ్మెల్యేను ఆశ్రయించినప్పుడు, ఆయన తనను లోబర్చుకున్నారని ఆరోపించారు. దాదాపు ఏడాదిన్నర కాలంగా తనపై లైంగిక వేధింపులు సాగాయని, ఎమ్మెల్యే తనను గర్భవతిని చేసి, ఆపై బలవంతంగా గర్భస్రావం చేయించారని సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, తన భర్తకు విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకోవాలని ఎమ్మెల్యే ఒత్తిడి చేశారని, నిరాకరించినందుకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆమె వాపోయారు. ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఏఎస్పీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా తనకు న్యాయం జరగడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా పవన్ కళ్యాణ్ కి హెచ్చరిక…
“న్యాయం జరగకపోతే పవన్ కళ్యాణ్ కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకుంటా” అని ఆమె చేసిన తాజా హెచ్చరిక ఈ కేసును పతాక స్థాయికి తీసుకెళ్లింది.
సొంత ఎమ్మెల్యే పై జనసేన పార్టీ చర్యలు తీసుకుంటుందా…?
మరోవైపు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. తన ఎదుగుదలని ఓర్వలేక రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న కుట్రగా ఆయన దీనిని అభివర్ణించారు. ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ మాట్లాడుతూ.. సదరు మహిళ తన కొడుకును బ్లాక్ మెయిల్ చేస్తోందని, పెళ్లి చేసుకోవాలని వేధిస్తోందని జనవరిలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, వాస్తవాలను తేల్చేందుకు టి.శివశంకర్, తంబళ్లపల్లి రామదేవి, టి.సి.వరుణ్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల అంతర్గత విచారణ కమిటీని నియమించారు. విచారణ పూర్తయ్యే వరకు ఎమ్మెల్యేను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో కూడా పవన్ ఈ అంశంపై అసహనం వ్యక్తం చేస్తూ, నేతలు క్రమశిక్షణ తప్పకూడదని హెచ్చరించినట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్‌కు సవాలుగా…
ఈ వ్యవహారం ఇప్పుడు జనసేన పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. బాధితురాలు మహిళా కమిషన్‌ను మరియు ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించడం, వరుసగా సెల్ఫీ వీడియోలు విడుదల చేయడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మహిళా భద్రత గురించి మాట్లాడే వ్యక్తి కావడంతో, సొంత పార్టీ ఎమ్మెల్యేపై ఆయన తీసుకునే తదుపరి చర్యల కోసం రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పోలీసు విచారణ ఒకవైపు, పార్టీ అంతర్గత కమిటీ నివేదిక మరోవైపు సాగుతుండగా.. బాధితురాలి “ఆత్మహత్య” హెచ్చరిక ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉరుకులు పెట్టిస్తోంది. ఈ కేసులో నిజానిజాలు ఎలా ఉన్నా, రాజకీయంగా ఇది ‘పొలిటికల్ టెంపర్’ను పెంచుతూ, కూటమి ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా నిలుస్తోంది.
కేసు ముఖ్య నేపథ్యం…
జనవరి 2026లో ఎమ్మెల్యేపై ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది.
బాధితురాలి ఫిర్యాదు: లైంగిక వేధింపులు, బలవంతపు గర్భస్రావం, బెదిరింపులు.
ఎమ్మెల్యే వాదన: ఇది కేవలం హనీట్రాప్ మరియు రాజకీయ కుట్ర అని ఆరోపణ.
పార్టీ చర్య: అంతర్గత కమిటీ ఏర్పాటు, ఎమ్మెల్యేపై తాత్కాలిక సస్పెన్షన్ వంటి చర్యలు.
తాజా పరిస్థితి: న్యాయం కోసం పవన్ కళ్యాణ్ కార్యాలయం ముందే నిరసన తెలుపుతానన్న బాధితురాలి ప్రకటన.
రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో.. జనసేన పార్టీకి ఇంకా ఎన్ని తలనొప్పులు వస్తాయో, పవన్ కళ్యాణ్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.