అమరావతికి ఆమోదముద్ర..
ఎన్నో మలుపులు చివరికి సుఖాంతం..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దాదాపు దశాబ్దంగా కొనసాగిన రాజధాని వివాదానికి తాత్కాలికంగా ముగింపు పలికిన పరిణామం చోటుచేసుకుంది. అమరావతిని రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధత కల్పించే సవరణ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలపడంతో, ఎన్నో మలుపులు తిరిగిన ఈ కథ ఇప్పుడు “సుఖాంతం” దిశగా అడుగులు వేసింది.
2014 నుంచి ప్రారంభమైన అమరావతి ప్రయాణం
2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత కొత్త రాజధాని అవసరం ఏర్పడింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని గ్రీన్‌ఫీల్డ్ రాజధానిగా ప్రకటించి, భారీ స్థాయిలో ప్రణాళికలు రూపొందించారు. రైతుల నుంచి భూముల సమీకరణ (ల్యాండ్‌పూలింగ్ ) చేసి, ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
2019 తర్వాత మారిన దిశ…మూడు రాజధానుల ప్రతిపాదన…
2019లో ప్రభుత్వం మారిన తర్వాత, మాజీ ముఖ్యమంత్రి వై . యస్ . జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. పరిపాలన వికేంద్రీకరణ పేరిట విశాఖపట్నం, అమరావతి, కర్నూలును వేర్వేరు రాజధానులుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.
ఈ నిర్ణయం అమరావతి రైతులు, ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా దీర్ఘకాలిక ఉద్యమాలు జరిగాయి. రాజధాని అంశం రాజకీయంగా అత్యంత హాట్ టాపిక్‌గా మారింది.
అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నలిగిపోయిన అమరావతి..?
ఒకవైపు వైసీపీ ప్రభుత్వం వికేంద్రీకరణ అవసరాన్ని వాదించగా, మరోవైపు టీడీపీ అమరావతి ఒక్కటే రాజధాని కావాలని గట్టిగా నిలబడింది. ఈ అంశంపై అసెంబ్లీ నుంచి కోర్టుల వరకు పోరు సాగింది.రై తుల నిరసనలు, పాదయాత్రలు, రాజకీయ ఆరోపణలు – ఇవన్నీ కలిపి అమరావతి అంశాన్ని రాష్ట్ర రాజకీయాల కేంద్రంగా నిలిపాయి.
పార్లమెంట్ బిల్లు – కీలక మలుపు…
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సవరణ బిల్లును ప్రవేశపెట్టి, అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా అడుగులు వేసింది. లోక్‌సభ, రాజ్యసభల్లో చర్చల అనంతరం బిల్లు ఆమోదం పొందింది. దీంతో అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించేందుకు చట్టపరమైన స్పష్టత వచ్చింది. పెట్టుబడిదారులు, ప్రజల్లో నమ్మకం పెరిగే పరిస్థితి ఏర్పడింది.
కథ సుఖాంతమేనా.. మళ్లీ మొదటికి వచ్చేనా ?
పార్లమెంట్ ఉభయసభల ఆమోదంతో అమరావతి రాజధాని అంశం ప్రస్తుతానికి ఒక ముగింపుకు వచ్చినట్టే కనిపిస్తున్నా, రాజకీయంగా ఇది పూర్తిగా ముగిసిందా అన్న ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది.
భవిష్యత్తులో మాజీ ముఖ్యమంత్రి జగన్ వైఖరి ఎలా ఉండబోతోందన్నది కీలకం. మూడు రాజధానుల ఆలోచనను పూర్తిగా వదిలేస్తారా? లేక మరో రూపంలో ముందుకు తీసుకువస్తారా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ పిలుపు….దీపాలతో అమరావతికి మద్దతు…
ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రత్యేక పిలుపునిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించి “మన రాజధాని అమరావతి”కి దీపహారతులు అందించాలని విజ్ఞప్తి చేశారు. సాయంత్రం 7 గంటలకు ఈ కార్యక్రమంలో పాల్గొని, వెలిగించిన దీపాలతో సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పంచుకోవాలని ప్రజలను ఆహ్వానించారు.
వైసీపీ వైఖరి..ఏమవుతుందీ తర్వాత..?
ఈ పరిణామంపై వైసీపీ అధికారికంగా పూర్తి స్థాయి స్పందన ఇంకా రానప్పటికీ, పార్టీ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి గతంలో ప్రోత్సహించిన వికేంద్రీకరణ విధానాన్ని కొనసాగిస్తారా లేదా కొత్త రాజకీయ వ్యూహంతో ముందుకు వస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో వైసీపీ స్పష్టమైన వైఖరి ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
EDITOR
TSR YADAV