ఆంధ్ర జాతికి గర్వ కారణం “అమరావతి” : ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు
– రాజధాని బిల్లుకు ఆమోదముద్ర పై హర్షం వ్యక్తం చేసిన చీఫ్ విప్
– రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన జీవి
అమరావతి ఆంధ్ర జాతికి గర్వకారణంగా నిలుస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు.
అమరావతి ని శాశ్వత రాజధానిగా నిలిపే క్రమంలో పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందడం రాష్ట్ర ప్రజలకు శుభసూచికమన్నారు జీవి ఆంజనేయులు. గత కొద్దిరోజులుగా వ్యక్తిగత పనులపై న్యూజిలాండ్ పర్యటంలో ఉన్న చీఫ్ జీవి ఆంజనేయులు అమరావతికి చట్టబద్ధత లభించిన శుభ తరుణంలో తన సంతోషాన్ని పంచుకునేందుకు వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు నియోజకవర్గం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషితో ఆంధ్ర ప్రజల కలల రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించిందన్నారు. అమరావతి అభివృద్ధిని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఆపటం ఎవరి తరం కాదని జీవీ స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకుడు ఆంధ్ర రాష్ట్ర విరోధిగా మారారని, పార్లమెంట్ ఉభయ సభల్లో రాజధాని బిల్లుకు వైసీపీ సభ్యులు మద్దతు తెలపకపోవడం బాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధాని ఘనంగా తీర్చి దిద్దుతుందని జీవి ఆంజనేయులు అభిప్రాయపడ్డారు. అమరావతి బిల్లు ఆమోదం పొందిన ఏప్రిల్ రెండవ తేదీని ప్రతి ఏటా పండుగలా నిర్వహించి స్వచ్ఛందంగా వేలాది ఎకరాలు భూములు రాజధానికి త్యాగం చేసిన అన్నదాతలకు సత్కరించాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలు అమరావతి రాజధానిగా ఆమోదం పొందిన శుభసందర్భంగా జాతీయ జెండా చేతబట్టి దీపాలు వెలిగించి తమ సంతోషాన్ని పంచుకోవాలని పిలుపునిచ్చారు. పార్లమెంటు ఉభయ సభల్లో అమరావతి బిల్లుకు మద్దతు తెలిపిన సభ్యులకు ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు.
జై అమరావతి అంటూ కదం తొక్కిన వినుకొండ…
రాజధాని బిల్లు ఆమోదంతో వినుకొండలో కూటమి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

రాష్ట్ర రాజధానిగా అమరావతిని పటిష్టం చేయాలనే బలమైన సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టిన చట్ట సవరణ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం మరియు పార్లమెంటు ఉభయ సభల నుండి చట్టపరమైన ఆమోదముద్ర లభించడం ఒక చారిత్రక ఘట్టంగా నిలిచింది. బుధవారం లోక్‌సభలోనూ, గురువారం రాజ్యసభలోనూ ఈ బిల్లు విజయవంతంగా ఆమోదం పొందడంతో అమరావతికి రాజ్యాంగబద్ధమైన గుర్తింపు లభించింది. ఈ శుభసందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుతో వినుకొండ పట్టణంలో కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు అత్యంత ఉత్సాహంతో భారీ ర్యాలీని నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ప్రదర్శనలో నాయకులు జాతీయ జెండాలను చేతబూని “జై అమరావతి.. జై జై అమరావతి” అంటూ మిన్నంటేలా నినదించారు. మార్గమధ్యలో ఉన్న జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న జి.డి.సి.సి. బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు మాట్లాడుతూ, అమరావతికి ఆమోదముద్ర లభించడం రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని, ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి అమరావతి నగరం ఒక కేంద్రబిందువుగా నిలుస్తుందని ఆకాంక్షించారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా వేలాది ఎకరాల భూములను త్యాగం చేయడం ప్రపంచ చరిత్రలోనే అరుదైన విషయమని, వారి త్యాగానికి నేడు గౌరవం దక్కిందని ఆయన కొనియాడారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బిల్లును ఆమోదించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరియు మద్దతు తెలిపిన పార్లమెంటు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, చంద్రబాబు నాయుడి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని మల్లికార్జున రావు పేర్కొన్నారు. వినుకొండ నియోజకవర్గంలో ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి. ఆంజనేయులు ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో అమరావతి ఒక అద్భుతమైన మహానగరంగా రూపుదిద్దుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ భారీ ప్రదర్శనలో కూటమి పార్టీల కార్యకర్తలు, స్థానిక నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని చాటారు.