
టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు వ్యవహార శైలిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ మెంబర్, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ధ్వజమెత్తారు. వినుకొండ నియోజకవర్గ పరిశీలకులు బాసు లింగారెడ్డితో కలిసి నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బి.ఆర్. నాయుడుకు మంచి బుద్ధి కలగాలని కోరుతూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ వంటి అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక సంస్థ గౌరవాన్ని భంగపరిచేలా బి.ఆర్. నాయుడు వ్యవహరిస్తున్నారని, ఆయనను వెంటనే చైర్మన్ పదవి నుంచి తొలగించి తిరుమల ప్రతిష్టను కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో దళితులు, మహిళలపై జరుగుతున్న దాడుల పట్ల బొల్లా బ్రహ్మనాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నర్సీపట్నంలో డప్పు కొడుతున్న దళితుడిపై దాడి జరగడం, స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి ఇటువంటి చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని మండిపడ్డారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వల్ల అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసిన బాధితురాలిపైనే దాడి జరగడం శోచనీయమన్నారు. పిఠాపురం, రైల్వే కోడూరు ప్రాంతాల్లో పోలీసుల సమక్షంలోనే మహిళలను కర్రలతో కొట్టడం అమానుషమని, ఈ సంఘటనలపై తక్షణమే పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వినుకొండ నియోజకవర్గంలోని రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం మొక్కజొన్న, ధాన్యం పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో రైతులు భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు.
ఆర్ సీ ఇంచార్జి
వినుకొండ