భారత రాజకీయ యవనికపై అలుపెరుగని పోరాట యోధుడిగా, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా వెలిగిన బాబు జగజీవన్ రామ్ జీవితం ఒక సమున్నత గ్రంథం. 1908 ఏప్రిల్ 5న బీహార్‌లోని ఒక పేద కుటుంబంలో జన్మించిన ఆయన, చిన్ననాటి నుంచే కుల వివక్ష అనే విష సర్పాన్ని ఎదుర్కొన్నారు. పాఠశాలలో కుండలోని నీళ్లు తాగనివ్వని వివక్ష నుంచి దేశ ఉప ప్రధానమంత్రి స్థాయి వరకు ఎదిగిన ఆయన ప్రస్థానం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం. విద్యాభ్యాస సమయంలోనే ఆయన ప్రతిభను గుర్తించిన మదన్ మోహన్ మాలవ్య వంటి వారు ఆయనను ప్రోత్సహించగా, బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు ఎదురైన అంటరానితనం ఆయనలో తిరుగుబాటు భావజాలాన్ని రగిల్చింది. ఇదే క్రమంలో కలకత్తాలో చదువుతున్నప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ దృష్టిని ఆకర్షించి, విద్యార్థి దశలోనే రాజకీయ చైతన్యాన్ని పుణికిపుచ్చుకున్నారు.
స్వాతంత్ర్య ఉద్యమకారుడిగా బాబు జగజీవన్ రామ్ పాత్ర అత్యంత కీలకం. గాంధీజీ పిలుపు మేరకు 1940లో సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారు, ఆ తర్వాత 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి బ్రిటిష్ పాలకుల కంటిమీద కునుకు లేకుండా చేశారు. సామాజిక సంస్కరణే స్వాతంత్ర్యానికి నిజమైన అర్థమని నమ్మిన ఆయన, ‘డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్’ ద్వారా దళితులను ఏకం చేశారు. అంబేద్కర్‌తో ఆయనకు ఉన్న సంబంధం పరస్పర గౌరవంతో కూడుకున్నది. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణంలో నిమగ్నమైతే, జగజీవన్ రామ్ ప్రభుత్వ వ్యవస్థలో ఉండి ఆ ఫలాలను అట్టడుగు వర్గాలకు చేర్చడంలో నిమగ్నమయ్యారు. నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, దేశ తొలి కార్మిక మంత్రిగా కార్మికుల భద్రత కోసం ప్రవేశపెట్టిన చట్టాలు నేటికీ మన కార్మిక వ్యవస్థకు మూలస్తంభాలుగా ఉన్నాయి.
దేశ రక్షణ మరియు ఆహార భద్రతలో ఆయన పోషించిన పాత్ర అద్వితీయం. 1971లో భారత్-పాక్ యుద్ధం సమయంలో రక్షణ మంత్రిగా ఆయన చూపిన ధైర్యం, వ్యూహరచన చిరస్మరణీయం. బంగ్లాదేశ్ విముక్తిలో ఆయన సైన్యానికి అందించిన నైతిక మద్దతు దేశ చరిత్రలో ఒక మైలురాయి. అలాగే, దేశం ఆహార కొరతతో అల్లాడుతున్న కాలంలో వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టి, శాస్త్రవేత్తలను ప్రోత్సహించి ‘హరిత విప్లవం’ (Green Revolution) విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. పంజాబ్, హర్యానా రైతుల శ్రమకు ప్రభుత్వ తోడ్పాటును అందించి దేశాన్ని ఆహార మిగులు రాష్ట్రంగా మార్చారు. ఇందిరా గాంధీతో సన్నిహితంగా ఉంటూనే, అత్యవసర పరిస్థితి (Emergency) సమయంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని భావించి నిర్భయంగా పార్టీ నుంచి బయటకు వచ్చి ‘కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ’ని స్థాపించడం ఆయన నైతిక విలువలకు నిదర్శనం.
రాజకీయాల్లో సామాజిక భద్రత అంటే కేవలం రాయితీలు ఇవ్వడం కాదు, ఆత్మగౌరవంతో కూడిన బతుకును అందించడమని ఆయన నమ్మేవారు. 50 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పార్లమెంటేరియన్‌గా ఉండి, ఏ పదవి చేపట్టినా దానికి వన్నె తెచ్చారు. రైల్వే శాఖ నుంచి కమ్యూనికేషన్స్ వరకు ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. నేటి సమాజంలో రాజకీయ లబ్ధి కోసం సామాజిక అంశాలను వాడుకునే ధోరణి పెరుగుతున్న తరుణంలో, జగజీవన్ రామ్ గారి విలువలతో కూడిన రాజకీయాలు ఆదర్శప్రాయం. కులం కంటే దేశం మిన్న అని, అణచివేతకు గురైన వర్గాలకు అధికారం అందినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం సాధ్యమని ఆయన చాటి చెప్పారు. ఆయన జయంతి వేళ, కేవలం నివాళులు అర్పించడమే కాకుండా, ఆయన ఆశించిన సమసమాజ నిర్మాణం కోసం ప్రతి పౌరుడు నడుం బిగించడమే ఆయనకు ఇచ్చే నిజమైన గౌరవం. బాబుజీ వారసత్వం కేవలం ఒక కుటుంబానికో, వర్గానికో పరిమితం కాదు.. అది యావత్ భారతదేశపు ఆత్మగౌరవ ప్రతీక.
ఎడిటర్
TSR YADAV
9494676217.