
ప్రత్యేక హోదా….అంటే
ఆంధ్రుల ఆత్మగౌరవమా?
రాజకీయ చదరంగమా..?
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దశాబ్దం దాటినా, నేటికీ ‘ప్రత్యేక హోదా’ అనేది ముగియని ఒక రాజకీయ ప్రహసనంగానే మిగిలిపోయింది. నాడు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయించుకోవడంలో అటు రాష్ట్ర నాయకత్వం, ఇటు కేంద్ర పాలకులు అనుసరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికే ఒక సవాలుగా మారింది. రాజధాని అమరావతిపై ఉన్న శ్రద్ధ, రాష్ట్రానికి రావాల్సిన చట్టబద్ధమైన హక్కు అయిన ప్రత్యేక హోదాపై ఎందుకు లేదన్నది నేడు సామాన్య పౌరుడిని వేధిస్తున్న ప్రధాన ప్రశ్న.
ప్రత్యేక హోదా అనేది కేవలం కొన్ని అదనపు నిధుల కేటాయింపు మాత్రమే కాదు. అది రాష్ట్ర పారిశ్రామిక రంగానికి ఒక ఊపిరిపోసే సంజీవని. హోదా ఉన్న రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీలు, పన్ను మినహాయింపులు (Income Tax and GST exemptions) లభిస్తాయి. దీనివల్ల భారీ పరిశ్రమలు తరలివచ్చి, లక్షలాది మంది నిరుద్యోగ యువతకు స్థానికంగానే ఉపాధి దొరుకుతుంది. కానీ, 14వ ఆర్థిక సంఘం నిబంధనలను అడ్డం పెట్టుకుని కేంద్రం ఈ హోదాను నిరాకరిస్తుంటే, దానిని ప్రశ్నించాల్సిన రాష్ట్ర నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం మౌనం వహించడం శోచనీయం. గతంలో ‘పాచిపోయిన లడ్డూలు’ అంటూ కేంద్రాన్ని ఎండగట్టిన గొంతులు నేడు అధికార భాగస్వామ్యంలో ఉండి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది.
రాజకీయ పార్టీల వైఖరిని పరిశీలిస్తే, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట చెప్పడం ఒక ఆనవాయితీగా మారింది. గత ప్రభుత్వం హోదా కోసం ఎంపీలతో రాజీనామాలు చేయించి, తర్వాత ‘ప్రత్యేక ప్యాకేజీ’ చుట్టూ కాలక్షేపం చేసింది. నేటి కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి వస్తున్న అరకొర నిధులను చూపిస్తూ, అదే ఒక గొప్ప విజయంగా ప్రచారం చేసుకుంటోంది. అమరావతి అనేది రాష్ట్రానికి గుండెకాయ లాంటిదైతే, ప్రత్యేక హోదా అనేది రాష్ట్రం మొత్తానికి వెన్నెముక వంటిది. వెన్నెముక లేని శరీరం నిలబడలేదని తెలిసినా, పాలకులు కేవలం తాత్కాలిక ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా నిర్మాణాత్మక పోరాటం కంటే స్వప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుండటంతో, అసలు అంశం పక్కదారి పట్టింది.

ప్రజల మౌనాన్ని నాయకులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు కేవలం ఓట్లు రాల్చుకోవడానికే అన్నట్లుగా నేటి రాజకీయం తయారైంది. ఒకప్పుడు హోదా కోసం విశాఖ ఆర్కే బీచ్లో యువత చేసిన నిశ్శబ్ద పోరాటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అటువంటి ఉద్వేగాన్ని మళ్ళీ రగల్చకుండా, ప్రజలను కుల, మత, ప్రాంతీయ విభేదాలతో విడగొట్టి పబ్బం గడుపుకుంటున్న నాయకులను చూస్తుంటే రాజకీయ నైతికత ఏ స్థాయిలో పడిపోయిందో అర్థమవుతుంది. ఏది ఏమైనా, చరిత్ర సాక్షిగా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. పాలకుల మౌనం, నాయకుల అబద్ధాలు ఎన్ని రోజులు సాగుతాయో కాలమే నిర్ణయించాలి.
– ఎడిటర్ టిఎస్ఆర్ యాదవ్ విశ్లేషణ