ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న నాయకుడు, ప్రస్తుత రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఆయన జన్మదిన సందర్భంగా, ఒక క్రీడాకారుడి నుండి శాసనసభాపతిగా, ఆపై ఒక పార్టీని నడిపించే వ్యూహకర్తగా ఆయన సాగించిన ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. ఆయన రాజకీయ ప్రస్థానం మరియు అనుభవాలపై ప్రత్యేక కథనం ….


నాదెండ్ల మనోహర్ రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే, ఆయనలో ఒక పరిపూర్ణమైన రాజకీయ పరిణతి మరియు నిలకడ స్పష్టంగా కనిపిస్తాయి. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటికీ, తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని అలవర్చుకున్నాడు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి శాసనసభాపతిగా వ్యవహరించిన తీరు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. రాష్ట్ర విభజన సమయంలో అసెంబ్లీలో నెలకొన్న అత్యంత ఉద్రిక్త పరిస్థితులను, భావోద్వేగాలను ఎంతో సంయమనంతో భరించి, సభను హుందాగా నడిపిన తీరు మనోహర్ నాయకత్వ పటిమకు మరియు సహనానికి నిదర్శనం. ఆ క్లిష్ట సమయంలో ప్రదర్శించిన నిష్పాక్షికత మరియు నిబద్ధత ఆయనను రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టాయి. జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో మనోహర్ పోషిస్తున్న పాత్ర అత్యంత కీలకమైంది. పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితుడిగా, పార్టీలో నంబర్ టూ స్థానంలో ఉంటూ కీలక బాధ్యతలను భుజానికెత్తుకున్నాడు. కేవలం రాజకీయ సహచరుడిగానే కాకుండా, ఒక నమ్మకమైన వ్యూహకర్తగా పవన్ కళ్యాణ్ అండగా నిలుస్తూ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నాడు. రాజకీయాల్లో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వెన్నంటి ఉండి నడిపించిన తీరు ఆయనలోని విధేయతను, రాజకీయ చతురతను చాటిచెబుతుంది. కూటమి ఏర్పాటులోనూ, పార్టీ తరపున కీలక నిర్ణయాలు తీసుకోవడంలోనూ మనోహర్ పాత్ర అమోఘం.
వ్యక్తిగతంగా నాదెండ్ల మనోహర్ అత్యంత సౌమ్యుడు మరియు మితభాషి. ఆవేశం కంటే ఆలోచనకే ప్రాధాన్యతనిచ్చే గుణం, క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పడుతుంది. ఒక జాతీయ స్థాయి టెన్నిస్ క్రీడాకారుడిగా ఆయనలో ఉన్న క్రమశిక్షణ, క్రీడా స్ఫూర్తి రాజకీయాల్లోనూ ప్రతిబింబిస్తాయి. గెలుపోటములను సమానంగా స్వీకరించడం, ప్రత్యర్థులపై సైతం వ్యక్తిగత విమర్శలు చేయకుండా కేవలం అంశాల వారీగా చర్చించడం ఆయన సంస్కారానికి నిదర్శనం. ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ మంత్రిగా తన దశాబ్దాల అనుభవాన్ని ఉపయోగిస్తూ, ప్రజా శ్రేయస్సు కోసమే నిరంతరం శ్రమిస్తున్నారు.
గెలుపు ఓటములకు అతీతమైన నాయకుడిగా….
నాదెండ్ల మనోహర్ రాజకీయ జీవితం గెలుపోటముల కలయికగా సాగినా, ఆయన ఎప్పుడూ తన హుందాతనాన్ని కోల్పోలేదు. 2004లో రాజకీయ అరంగేట్రం చేస్తూనే తెనాలి నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత 2009లో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది, తన నియోజకవర్గంపై పట్టును నిరూపించుకున్నాడు. ఈ కాలంలోనే డిప్యూటీ స్పీకర్గా, అనంతరం స్పీకర్గా అత్యున్నత పదవులను అధిరోహించడం ఆయన సాధించిన అతిపెద్ద విజయాలు. అయితే, 2014లో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకత ప్రభావంతో ఆయన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత జనసేనలో చేరి 2019లో తెనాలి నుండి పోటీ చేసినా, త్రిముఖ పోటీలో విజయం వరించలేదు. అయినప్పటికీ ఏ మాత్రం కుంగిపోకుండా పార్టీ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ వెన్నంటి ఉండి, 2024 ఎన్నికల్లో కూటమి తరపున భారీ మెజారిటీతో తెనాలిలో ఘనవిజయం సాధించి, ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఈ ప్రయాణంలో ఓటమి ఎదురైనప్పుడు కూడా ప్రజల మధ్యే ఉంటూ పట్టుదలతో పోరాడటం ఆయన రాజకీయ పరిణతికి నిదర్శనం.
”అధికారం అనేది సేవ చేయడానికి ఒక అవకాశం” అని నమ్మే అతికొద్ది మంది నాయకులలో నాదెండ్ల మనోహర్ ఒకరు. స్పీకర్గా సభను శాసించినా, మంత్రిగా పాలన సాగిస్తున్నా ఆయనలో ఉన్న వినయం తగ్గలేదు. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ, ప్రజా సేవలో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుందాం.
పుట్టినరోజు శుభాకాంక్షలు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు!
ఎడిటర్
టి ఎస్ ఆర్ యాదవ్