తాడేపల్లి కేంద్రంగా సరికొత్త సమీకరణాలు: కరువు అజెండాతో కూటమి సర్కార్‌పై ప్రతిపక్షాల వ్యూహాత్మక ‘ఎర్ర’ బావుటా!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన మలుపు చోటుచేసుకుంది. అధికారం మారిన తర్వాత అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష హోదా కూడా లేక ఏకాకిగా మారిన వైఎస్సార్సీపీకి… నిన్నటి వరకు ఆ పార్టీ విధానాలపై కత్తులు దూసిన వామపక్షాలు ఇప్పుడు తోడవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ తదితర ప్రతినిధి బృందం స్వయంగా వెళ్లడం, ఈ నెల 26న జరిగే కరువు రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయనను ఆహ్వానించడం సాధారణ భేటీగా మాత్రమే కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాక్షేత్రంలో ఉమ్మడి పోరుకు ఇదొక బలమైన రాజకీయ పునాదిగా మారుతోందన్న విశ్లేషణలు ఊపందుకున్నాయి.
సంక్షోభం తెచ్చిన సయోధ్య
నిన్నటివరకు ఉత్తర, దక్షిణ ధ్రువాలుగా ఉన్న వైఎస్సార్సీపీ, సీపీఐ ఒకే వేదికపైకి రావడానికి రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులు పునాది వేశాయి. రాష్ట్రవ్యాప్తంగా కరువు తాండవిస్తుంటే, ప్రభుత్వం 65 లక్షల ఎకరాల్లో సాగు జరిగిందని లెక్కలు చెబుతోందని, క్షేత్రస్థాయిలో 50 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగుబడి ఉందని సీపీఐ ఘాటుగా నిలదీసింది. ఆలస్యంగా కురిసిన వర్షాలు భూగర్భ జలాలను పెంచగలవే తప్ప, చేతికి రాని పంటలను బతికించలేవన్న వాస్తవాన్ని ఎత్తిచూపుతూ.. కరువును ‘జాతీయ విపత్తు’గా ప్రకటించాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. రైతు కన్నీళ్లు, అన్నదాతల ఆగ్రహాన్ని ప్రధాన అజెండాగా మార్చుకోవడం ద్వారా విపక్షాలు కూటమి ప్రభుత్వానికి బలమైన ప్రజాక్షేత్ర సవాలు విసరాలని నిర్ణయించుకున్నాయి.
ప్రజా సమస్యల ఎజెండాతో రాజకీయ ఉచ్చు
తాడేపల్లి భేటీ కేవలం వ్యవసాయ సంక్షోభానికే పరిమితం కాలేదు. కూటమి ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో సెగ పుట్టించే అన్ని అంశాలను గుజ్జుల ఈశ్వరయ్య ప్రస్తావించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో జీవనోపాధి కోసం వలస వెళ్లిన అభాగ్యుల ఓట్లను రాత్రికి రాత్రే తొలగిస్తున్నారని, ఇది నేరుగా ఓటు హక్కుపై దాడి అని విపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు డీఎస్సీ నిర్వహణలో జరిగినట్లుగా చెబుతున్న అక్రమాలపై నిరుద్యోగులు తిరగబడుతుంటే.. సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం లాఠీఛార్జీలు, భౌతిక దాడులు, రౌడీషీట్లతో గొంతు నొక్కాలని చూడటం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టుగా అభివర్ణించారు. ప్రతిపక్షం డిమాండ్ చేస్తున్నట్లుగా డీఎస్సీపై సీబీఐ (CBI) విచారణకు సీపీఐ సైతం సంపూర్ణ మద్దతు ప్రకటించడం ప్రభుత్వ విధానాలపై ఉమ్మడి దాడికి సిద్ధమైనట్లు సంకేతాలిస్తోంది.
తెరవెనుక రాజకీయ సమీకరణం: ఎవరికి లాభం?
ఈ ఐక్యత వెనుక రెండు పక్షాలకూ స్పష్టమైన రాజకీయ అవసరాలు ఉన్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత క్షేత్రస్థాయి పోరాటాల్లో నిలబడేందుకు బలమైన సామాజిక, ప్రజాసంఘాల అండ అవసరమైన వైఎస్సార్సీపీకి… వామపక్షాల అనుబంధ రైతు, కార్మిక, విద్యార్థి విభాగాల సహకారం కొండంత అండగా మారుతుంది. అటు వామపక్షాలకు సైతం ప్రజల్లో బలమైన ఓటు బ్యాంక్, కేడర్ ఉన్న ప్రధాన ప్రతిపక్షం తోడైతే ఉద్యమాలకు రాజకీయ బలం చేకూరుతుంది. “కూటమి మినహా మిగతా రైతు సంఘాలు, పార్టీలతో కలిసి పోరాటం” అని ప్రకటించడం ద్వారా చంద్రబాబు-పవన్-బీజేపీ కూటమిని పూర్తిగా ఏకాకిని చేసి ఇరుకున పెట్టాలన్న వ్యూహం స్పష్టమవుతోంది.
నిరసనకారులపై దాడులు, కేసుల పేరుతో భయభ్రాంతులకు గురిచేసి అసమ్మతిని అణచివేయాలని చూస్తే ప్రతిఘటన తప్పదని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి. సెప్టెంబర్ 26న జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశం కేవలం రైతు సమస్యలపై చర్చ మాత్రమే కాదు.. రాబోయే రోజుల్లో కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రూపుదిద్దుకోబోయే సరికొత్త ప్రతిపక్ష కూటమికి మొదటి అడుగుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.