*నేనే సీఎం…*
తమిళనాడు రాజకీయ యవనికపై ఒక నూతన శకం ఆరంభమైంది. దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ దిగ్గజాల ద్వంద్వ పోరాటానికి తెరదించుతూ, నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కజగం (TVK) తొలి అడుగులోనే రికార్డు స్థాయి విజయంతో ప్రభంజనం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో రాష్ట్రంలో హంగ్ ఏర్పడినప్పటికీ, 108 స్థానాలను కైవసం చేసుకున్న విజయ్ అతిపెద్ద పార్టీ నాయకుడిగా అవతరించి, హంగ్ లో అసలైన కింగ్ అనిపించుకున్నారు. ప్రస్తుతం పనయూరులోని TVK ప్రధాన కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తల కోలాహలంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రి విజయ్ అనే నినాదాలతో పనయూరు మార్మోగుతోంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే 108 సీట్లు గెలవడం విజయ్ వర్చస్సుకు, మార్పు కోరుకుంటున్న తమిళ ప్రజల ఆకాంక్షకు నిదర్శనంగా నిలిచింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 కాగా, TVK కేవలం పది సీట్ల దూరంలో నిలిచింది.
ఈ కీలక తరుణంలో విజయ్ రాజకీయంగా మరో భారీ ముందడుగు వేశారు. నేనే సీఎం అని ప్రకటించుకుంటూ, చెన్నైలోని లోక్‌భవన్‌లో తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను విజయ్ అధికారికంగా కలిశారు. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని, అందుకు సహకరించాలని గవర్నర్‌ను ఆ లేఖలో విన్నవించారు. అసెంబ్లీ వేదికగా రెండు వారాల్లో తమ బలాన్ని నిరూపించుకుంటానని విజయ్ స్పష్టం చేశారు. ఇప్పటికే విజయ్ టీవీకే శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేడు ఉదయం 11 గంటలకు విజయ్ తన పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతును ఎలా కూడగట్టాలి, సంకీర్ణ ధర్మాన్ని ఎలా పాటించాలి అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
మరోవైపు, సంప్రదాయ పార్టీలైన DMK మరియు AIADMK ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. ముఖ్యంగా సిట్టింగ్ సీఎం ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరులో టీవీకే అభ్యర్థి చేతిలో ఓడిపోవడం ఈ ఎన్నికల అతిపెద్ద సంచలనం. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చిన్న పార్టీల పాత్ర అత్యంత కీలకంగా మారింది. విజయ్ కు అవసరమైన 11 సీట్ల మద్దతు కచ్చితంగా లభించే అవకాశం కనిపిస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తనకు మద్దతు ఇవ్వాలని విజయ్ కోరడంతో కాంగ్రెస్ అధిష్టానం సానుకూలంగా స్పందించింది. దీనిపై నిర్ణయం తీసుకునే బాధ్యతను రాష్ట్ర నాయకత్వానికి అప్పగించింది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం విజయ్ దళపతితో రెండు రకాలుగా చర్చలు జరిపి, 11 కండిషన్స్ తో అసెంబ్లీలో విజయ్ కి సహకరించేందుకు అంగీకరించడంతో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు ఏఐడీఎంకే పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో పళనిస్వామికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 47 మంది ఏఐడీఎంకే ఎమ్మెల్యేలు తాజా ఎన్నికల్లో గెలుపొందగా, వారిలో సుమారు 40 మంది ఎమ్మెల్యేలు టీవీకే అధినేత విజయ్ కు మద్దతు తెలిపి అధికారంలో భాగస్వాములమవుదామని పళనిస్వామికి తేల్చి చెప్పినట్లు సమాచారం. అందుకు పళనిస్వామి అంగీకరించకపోతే 2/3 వంతు మెజారిటీ ఉన్న శాసనసభ్యులంతా ఉమ్మడిగా వెళ్లి టీవీకే విజయ్ కి మద్దతు తెలిపి పార్టీ ఏర్పాటుకు సహకరించడంతో పాటు, ఏఐడీఎంకే పార్టీని టీవీకేలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని సంకేతాలు తమిళనాడులో బలంగా వినిపిస్తున్నాయి. తమిళ ఎన్నికలు పుణ్యమా అని రాజకీయాల్లో అనేక అంశాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి.
ఎన్నికలకు ముందు ఒక లెక్క.. ఎన్నికలయ్యాక మరో లెక్క అన్నట్లుగా దళపతి ఇప్పుడు తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. మద్దతు ఇచ్చే పార్టీల విషయంలో విజయ్ అనుసరిస్తున్న వ్యూహాలు రాజకీయ విశ్లేషకులకు కూడా అంతు పట్టడం లేదు. దీంతో విజయ్ ముఖ్యమంత్రి కావడం ఇప్పుడు కేవలం లాంఛనంగానే కనిపిస్తోంది. ఇప్పటికే మంత్రివర్గ ఏర్పాటు, కీలక శాఖల కేటాయింపుపై ఆయన ప్రాథమిక కసరత్తు పూర్తి చేశారు. అనుభవం, ఉత్సాహం కలగలిసిన కొత్త తరహా టీమ్‌ను ఆయన సిద్ధం చేస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా, పదవి చేపట్టిన మొదటి రోజే తన మేనిఫెస్టోలోని కీలక హామీలను అమలు చేయాలని విజయ్ కృతనిశ్చయంతో ఉన్నారు. మహిళా ఓటర్ల కోసం నెలకు ₹2,500 ఆర్థిక సాయం, రైతులకు రుణాల పూర్తి మాఫీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ వంటి ఆధునిక హామీలతో విజయ్ ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. రాబోయే 14 రోజులు తమిళనాడు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.