డిమాండ్లు నెరవేరే దాకా బిసి ధర్మదీక్ష ఆగదు
– రెండో రోజుకు చేరిన “బీసీ ధర్మ దీక్ష”
– రామచంద్రయాదవ్ ఆమరణ నిరాహారదీక్షకు పెరుగుతున్న మద్దతు
– అమరావతి ఫామ్ హౌస్ల కోసమా?
-రేవ్ పార్టీల కోసమా? నిలదీసిన రామచంద్రయాదవ్
– క్షీణిస్తున్న రామచంద్రయాదవ్ ఆరోగ్యం
– చంద్రబాబు ఇచ్చిన హామీలనే నెరవేర్చమంటున్నాం..
– ప్రభుత్వం దిగివచ్చే వరకు దీక్ష ఆగదు
– ధర్మాదీక్షా స్థలి నుంచి రామచంద్రయాదవ్ అల్టిమేటం
బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ చేపట్టిన “బీసీ ధర్మ దీక్ష” రెండో రోజుకు చేరుకుంది. రెండు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన శరీరంలో ఎలక్ట్రోలైట్స్, మినరల్స్, కాల్షియం, మెగ్నీషియం, గ్లూకోజ్ స్థాయిలు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని, ఆక్సిజన్ సాచురేషన్ లెవల్స్ కూడా పడిపోవచ్చని వైద్య బృందం హెచ్చరించింది. అయినప్పటికీ, ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలు, న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చే వరకు తన దీక్షను విరమించే ప్రసక్తే లేదని రామచంద్రయాదవ్ స్పష్టం చేశారు.
రామచంద్రయాదవ్ దీక్షకు పెరుగుతున్న మద్దతు…
సంఘీభావం ప్రకటించిన విజయసాయిరెడ్డి
రామచంద్రయాదవ్ ధర్మదీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతోంది. రెండో రోజు తెలగ, కాపు, బలిజ జెఎసి ఛైర్మన్ దాసరి రాము, అఖిల భారత యాదవ సంఘం జాతీయ అధ్యక్షులు బుసగాని లక్ష్మయ్య, కార్యదర్శి పిఎల్పి యాదవ్, జాతీయ యాదవ సంఘం సెక్రటరీ జనరల్ బొడ్డు రమేష్ యాదవ్, జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహారావు, బిసి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దువ్వూరు అరుణ, గుంటూరు జిల్లా ఏబీవీపీ నాయకులు వంశీకృష్ణ, బీసీ నాయీ బ్రాహ్మణ వాద్య కళాకారుల సంఘం నుంచి యలమందరావు, ఢిల్లీలోని ఆల్ ఇండియా వడ్డెర కౌన్సిల్ నాయకులు చల్లా లీలా భానుప్రసాద్, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సి. కృష్ణ సహా అనేకమంది ప్రముఖులు, సంఘాల నాయకులు దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం ప్రకటించారు. మాజీ రాజ్యసభ సభ్యులు వి. విజయసాయి రెడ్డి కూడా ట్విట్టర్ ద్వారా దీక్షకు పూర్తి మద్దతు ప్రకటించారు.
బిసిల వెన్నెముక విరిచేస్తున్న చంద్రబాబు…
బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరినా స్పందన శూన్యమని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ధర్మదీక్షా స్థలిలో మీడియాతో మాట్లాడారు. “బీసీల హక్కుల సాధన కోసం ధర్మ దీక్ష’కు పూనుకున్నాను. నేను అడుగుతున్న ఐదు డిమాండ్లలో నాలుగు, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీలకు ఇచ్చిన హామీలే. బీసీ రక్షణ చట్టం, జనాభా గణన, 44% రిజర్వేషన్లు… ఇవన్నీ టీడీపీ ఆవిర్భావం నుంచి ఇస్తున్న హామీలే. బీసీలు మాకు వెన్నెముక అని చెప్పుకునే చంద్రబాబు, ఇప్పుడు వారి వెన్నెముక విరిచే కుట్ర రాజకీయాలు చేస్తున్నారు.” అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు
అమరావతి ఫామ్ హౌస్ల కోసమా?
రేవ్ పార్టీల కోసమా?
“ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చంద్రబాబు కుటుంబానికో, ఆయన పుత్రరత్నం నారా లోకేష్ బినామీలకో చెందింది కాదు. ఇది రాష్ట్ర ప్రజలందరి ఆస్తి. లక్ష ఎకరాల రాజధానిలో ప్రభుత్వ అవసరాలు పోగా, ప్రైవేట్ కంపెనీలకు ఏ ప్రాతిపదికన భూములు ఇస్తున్నారో, అదే ప్రాతిపదికన బీసీలకు వెయ్యి ఎకరాలు కేటాయించాలి. ఆ భూమికి మీరు నిర్ణయించిన ధర చెల్లించడానికి నేను, బీసీవై పార్టీ సిద్ధంగా ఉన్నాం. టీడీపీ అనుకూల మీడియాలో అమరావతిలో ఫామ్ హౌస్లు కట్టుకోవడానికి 7,000 మంది ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్నారని కథనాలు వస్తున్నాయి. నిజంగా అమరావతి ప్రజా రాజధానా? లేక ఫామ్ హౌస్లు, రేవ్ పార్టీల కోసమా? దీనిపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలి. హైదరాబాద్లో జరిగిన భూదోపిడీ అమరావతిలో పునరావృతం కానివ్వం.” అని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వం దిగివచ్చే వరకు దీక్ష ఆగదు…
“రాష్ట్ర, జాతీయ స్థాయిలోని బీసీ సంఘాలు, నాయకులు, మేధావులు నా న్యాయపరమైన పోరాటానికి మద్దతు తెలుపుతున్నారు. నాకు మద్దతు ప్రకటించిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా విజయసాయి రెడ్డికి నా కృతజ్ఞతలు. ప్రభుత్వం మా ఐదు డిమాండ్లను నెరవేర్చి, దిగివచ్చేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. దీనిపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.” అని రామచంద్రయాదవ్ తేల్చిచెప్పారు.
రామచంద్రయాదవ్ దీక్షకు కాపు, తెలగ, బలిజ జేఏసీ చైర్మన్ దాసరి రాము మద్దతు…
బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ చేపట్టిన “బీసీ ధర్మ దీక్ష”కు కాపు, తెలగ, బలిజ జేఏసీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని జేఏసీ చైర్మన్ దాసరి రాము తెలిపారు. బడుగు, బలహీన వర్గాలు రాజ్యాధికారం చేపట్టాలనే రామచంద్రయాదవ్ ఆశయానికి తాము అండగా ఉంటామన్నారు. రాజధాని అమరావతిలో కేవలం కొందరికే కాకుండా, బీసీ, ఎస్సీ, కాపులతో సహా అన్ని పేద వర్గాలకు సమహక్కులు, భాగస్వామ్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్పొరేషన్లు పెట్టి నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం బీసీలను, కాపులను మోసం చేస్తోందని విమర్శించారు. డబ్బుల్లేనప్పుడు పథకాలు ప్రకటించి రాష్ట్రాన్ని శ్రీలంకలా మారుస్తారా అని ప్రశ్నించారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా, నిజాయితీగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న రామచంద్రయాదవ్కు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని, ఆయన రాజ్యాధికార లక్ష్య సాధనలో కలిసి పనిచేస్తామని దాసరి రాము స్పష్టం చేశారు.
