బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ గా మారనుందా…
మళ్లీ పునర్వైభవం దిశగా..
అస్తిత్వం నుండి అధికారం వరకు…
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మరో చారిత్రక మలుపు తీసుకోబోతోంది. సుమారు రెండు దశాబ్దాల పాటు తెలంగాణ అస్తిత్వానికి, పోరాటానికి చిరునామాగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) మళ్లీ ప్రాణం పోసుకోనుంది. భారత్ రాష్ట్ర సమితి (BRS)గా మారిన తర్వాత ఎదురైన రాజకీయ సవాళ్లు, ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.. తిరిగి సొంత ఇంటి పేరుతోనే ప్రజల్లోకి వెళ్లాలని గులాబీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
అస్తిత్వం….తెలంగాణ పేరులోనే ఉంది బలం…
తెలంగాణ ఉద్యమం కేవలం నీళ్లు, నిధులు, నియామకాల కోసమే కాదు.. అది ఆత్మగౌరవ పోరాటం. ఆ పోరాట కేంద్ర బిందువు ‘తెలంగాణ’ అనే పదం. 2001లో కేసీఆర్ పార్టీ స్థాపించినప్పుడు ‘తెలంగాణ’ అనే పేరును జోడించడం ద్వారా ఒక ప్రాంతీయ భావోద్వేగాన్ని రాజకీయ శక్తిగా మార్చారు. అయితే, జాతీయ రాజకీయాల ఆశయంతో ‘బీఆర్ఎస్’గా మారినప్పుడు, పార్టీ తన ప్రాథమిక గుర్తింపును (Identity) కోల్పోయిందనే వాదన బలంగా వినిపించింది. పేరులో ‘తెలంగాణ’ లేకపోవడం వల్ల సగటు ఓటరుకు, పార్టీకి మధ్య ఉన్న భావోద్వేగ బంధం కొంత సడలింది. ఇప్పుడు మళ్లీ టీఆర్ఎస్గా మారడం అంటే.. కోల్పోయిన ఆ ‘అస్తిత్వాన్ని’ వెతుక్కోవడమే.
గులాబీ జెండా – గడప గడపకూ అనుబంధం…
తెలంగాణ ప్రజల పాలిట ‘టీఆర్ఎస్’ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు, అది ఒక సెంటిమెంట్. మలిదశ ఉద్యమంలో ప్రతి గ్రామంలో ఎగిరిన గులాబీ జెండా, ప్రతి గడపకూ చేరిన ‘జై తెలంగాణ’ నినాదం టీఆర్ఎస్తోనే ముడిపడి ఉన్నాయి. ‘బిఆర్ఎస్’ అనే పేరు ప్రజలకు కొంత కొత్తగా, యాంత్రికంగా అనిపించింది. కేటీఆర్ అన్నట్లుగా, పేరు మార్పు వల్ల క్యాడర్ లోనూ, ప్రజల్లోనూ ఒక రకమైన శూన్యత ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ పాత పేరును తలకెత్తుకోవడం ద్వారా, ఆ పాత ‘సెంటిమెంట్’ను రాజేసి, ప్రజల మనసులను మళ్లీ గెలుచుకోవాలని పార్టీ భావిస్తోంది.
‘బిఆర్ఎస్’గా మారిన తర్వాత ఎదురైన పరాభవం…
టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా మారిన తర్వాత జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఊహించని పరాభవం ఎదురైంది. 2018 ఎన్నికల్లో 88 స్థానాలను కైవసం చేసుకుని ఏకఛత్రాధిపత్యం వహించిన గులాబీ పార్టీ, 2023లో కేవలం 39 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని దక్కించుకోగా, బీజేపీ కూడా 8 స్థానాలను గెలుచుకుని తన బలాన్ని పెంచుకుంది. జాతీయ రాజకీయాల కోసం రాష్ట్రంపై దృష్టి తగ్గించడం, స్థానిక అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత వంటి కారణాలు ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఫలితాలు పార్టీ నాయకత్వానికి పెద్ద గుణపాఠం నేర్పాయి.
ఉద్యమ స్ఫూర్తి… గుర్తొచ్చేలా..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో టీఆర్ఎస్ పాత్ర అద్వితీయం. సిద్ధాంతకర్త జయశంకర్ సార్ మార్గదర్శనంలో, కేసీఆర్ నాయకత్వంలో సాగిన పోరాటం ప్రపంచ చరిత్రలోనే ఒక ప్రత్యేక అధ్యాయం. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ వంటి కార్యక్రమాలతో ఢిల్లీ పీఠాన్ని కదిలించిన చరిత్ర టీఆర్ఎస్ది. గత పదేళ్ల పాలనలో ‘రాజకీయ పార్టీ’గా ముద్రపడ్డ టీఆర్ఎస్, ఇప్పుడు మళ్లీ తన ‘పోరాట రూపాన్ని’ (Agitational Mode) సంతరించుకోవాలని చూస్తోంది. ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటం చేయడం ద్వారా, ఉద్యమ కాలం నాటి పట్టును మళ్లీ సాధించడమే లక్ష్యం.
కేసీఆర్ ఆద్యుడు.. వ్యూహకర్త.. మార్గదర్శి….
తెలంగాణ రాష్ట్ర సాధకుడుగా కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. చావో రేవో తేల్చుకోవాలని ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్ష రాష్ట్ర సాధనలో టర్నింగ్ పాయింట్. ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిన ఆయన, దేశ రాజకీయాలను ప్రభావితం చేయాలనే భారీ లక్ష్యంతో బీఆర్ఎస్ను స్థాపించారు. అయితే, తెలంగాణే తన బలమని గుర్తించిన కేసీఆర్, ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకున్నారు. మళ్లీ తెలంగాణ అస్తిత్వ వాదాన్ని భుజానికెత్తుకుని, ప్రాంతీయ పార్టీల ఆవశ్యకతను చాటిచెప్పేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.
కేటీఆర్..వారసుడు కాదు.. సైన్యాధ్యక్షుడు…
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కేటీఆర్ పోషిస్తున్న పాత్ర అత్యంత కీలకం. ఒకవైపు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే, మరోవైపు క్షేత్రస్థాయిలో క్యాడర్లో ధైర్యం నింపుతున్నారు. తాజాగా ఆయన ప్రకటించిన ‘పాదయాత్ర’ మరియు పేరు మార్పుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయనలోని రాజకీయ పరిణతిని చూపిస్తున్నాయి. తండ్రి వారసత్వంగా వచ్చిన ఉద్యమ స్ఫూర్తిని, ఆధునిక రాజకీయ వ్యూహాలతో జోడించి పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా కేటీఆర్ శ్రమిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ టీఆర్ఎస్ చక్రం తిప్పనుందా?
గత అసెంబ్లీ ఎన్నికల ఓటమి కేవలం ఒక తాత్కాలిక విరామం మాత్రమేనని గులాబీ శ్రేణులు నమ్ముతున్నాయి. మారిన రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ వైఫల్యాలు, బీజేపీ దూకుడును ఎదుర్కోవాలంటే ‘తెలంగాణ వాదం’ మళ్లీ బలంగా వినిపించాల్సిందే. టీఆర్ఎస్గా పేరు మార్చుకోవడం అనేది కేవలం టెక్నికల్ అంశం కాదు, అది ఒక రాజకీయ పునర్జన్మ. పూర్వ వైభవం దిశగా వేస్తున్న ఈ అడుగు తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.