నారా లోకేష్ నాయకత్వం.. పార్టీ ఉజ్వల భవిష్యత్తుకు సంకేతం: ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు*
వినుకొండ: తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టడం పార్టీ చరిత్రలో ఒక కీలక మలుపు అని, ఇది సరికొత్త చరిత్రకు నాంది అని ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. వినుకొండలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లోకేష్ నియామకం పట్ల వినుకొండ నియోజకవర్గ ప్రజలు మరియు పార్టీ కార్యకర్తల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. నందమూరి తారకరామారావు వారసత్వం, చంద్రబాబు నాయుడు రాజకీయ పాఠశాలలో పెరిగిన లోకేష్, తన స్వయంకృషితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. ప్రత్యర్థుల విమర్శలను తన పనితీరుతోనే తిప్పికొట్టిన నాయకుడని, ‘యువగళం’ పాదయాత్ర ద్వారా కుప్పం నుండి ఇచ్చాపురం వరకు 3,132 కిలోమీటర్లు నడిచి, ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారని గుర్తుచేశారు. ఈ యాత్రే 2024 ఎన్నికల్లో మంగళగిరిలో 91,413 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించడానికి పునాది వేసిందని, ఓటమిని పాఠంగా మార్చుకున్న ఆయన రాజకీయ దృఢత్వం అభినందనీయమని పేర్కొన్నారు.
పేదల సంక్షేమంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధను జీవీ ఆంజనేయులు కొనియాడారు. ముఖ్యంగా పేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లు గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించడం చంద్రబాబు నాయుడు ఆదర్శవంత పాలనకు నిదర్శనమని ఆయన ప్రశంసించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ సైతం గూగుల్, టీసీఎస్ వంటి అంతర్జాతీయ సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల హబ్‌గా మార్చాలనే స్పష్టమైన విజన్‌తో ఆయన ముందుకు సాగుతున్నారని చెప్పారు. పార్టీని డిజిటల్‌గా బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని, అటు ప్రభుత్వం, ఇటు పార్టీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యం ఆయనకు ఉందన్నారు. కార్యకర్తల మనోభావాలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడుతూ, వినుకొండలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని జీవీ తెలిపారు. ముఖ్యంగా వినుకొండ కొండకు ఘాట్ రోడ్డు నిర్మాణం, కొండపై వెలసిన రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం, మరియు గిరి ప్రదక్షణ రోడ్డు పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయని వెల్లడించారు. పట్టణంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా నూతన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నామని, ‘జలధార’ కార్యక్రమం ద్వారా నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజలు ఇప్పటికే వైసీపీ పాలనను తిరస్కరించారని, ఆ పార్టీ ఉనికి కోల్పోయే రోజులు దగ్గరపడ్డాయని విమర్శించారు. నారా లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత శక్తివంతంగా మారుతుందని, 2029 ఎన్నికల్లో కూటమి విజయాన్ని ఏ శక్తి అడ్డుకోలేదని ధీమా వ్యక్తం చేశారు.