వినుకొండ జనసేనకి ” కొత్త బాస్”…?
బీసీ అస్త్రంతో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్!
వినుకొండ నియోజకవర్గ జనసేన రాజకీయాల్లో భారీ మార్పులు జరగబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. గత 12 ఏళ్లుగా పార్టీని ఒకే సామాజిక వర్గం ముందుండి నడిపించినప్పటికీ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈసారి ఒక బలమైన బీసీ అభ్యర్థికి నియోజకవర్గ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం దాదాపు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జనసేన సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్‌గా ఉన్న నిశ్శంకర శ్రీనివాసరావు, అలాగే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నియోజకవర్గ సమన్వయకర్త రాయల శ్రీనివాసరావులతో చర్చించిన తర్వాతే కొత్త ఇన్చార్జిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
నియోజకవర్గంలో పార్టీకి మొదటి నుండి అండగా ఉన్న కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకుకు, ఇప్పుడు బీసీ నాయకత్వం తోడైతే బీసీ – కాపు కాంబినేషన్ పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా జూలై-ఆగస్టులో జరగబోయే స్థానిక ఎన్నికల్లో జనసేన కోటాలో వచ్చే స్థానాలను కైవసం చేసుకుని, పార్టీని అట్టడుగు స్థాయి నుండి బలోపేతం చేయడమే లక్ష్యంగా అధినాయకత్వం అడుగులు వేస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన ఒక కీలక బీసీ నాయకుడు, పవన్ కళ్యాణ్‌తో తనకున్న సాన్నిహిత్యంతో ఇప్పటికే ఒక అభ్యర్థిని జనసేనానికి పరిచయం చేశారని, ఆ వ్యక్తి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.