దేశంలో వెన్నెముకలేని ప్రధాని మోదీ
— వినుకొండలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్ర విమర్శలు
— జగన్, బాబు, పవన్‌లు బీజేపీకి మద్దతుదారులే
వినుకొండ: దేశ విదేశాంగ విధానంలో పూర్తిగా విఫలమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని ప్రమాదకర దిశలో నడిపిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఏపీ రైతు సంఘం అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా విమర్శించారు. ఆదివారం వినుకొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్యం తర్వాత దేశాన్ని పాలించిన ప్రధాన మంత్రులందరూ అలీన విధానాన్ని అనుసరించగా, మోదీ మాత్రం ‘దేశభక్తి’ పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. దేశానికి ఆయిల్, గ్యాస్ కొనుగోలు చేయాలన్నా అమెరికా అనుమతి తీసుకునే స్థితి రావడం దేశ సార్వభౌమాధికారానికి ప్రమాదమని హెచ్చరించారు.
రైతు పరిస్థితి దయనీయం…
దేశంలో వ్యవసాయం కుదేలైందని, రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని గుజ్జుల ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక, ఆర్థిక సహాయం అందక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోనే వందల సంఖ్యలో రైతులు ప్రాణాలు కోల్పోయారని, దేశవ్యాప్తంగా రోజూ పలువురు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు కాలేదని, సాగు సాయం పేరుతో ప్రకటించిన ఆర్థిక సహాయం రైతులకు చేరడం లేదని విమర్శించారు. ప్రభుత్వాలు పని కంటే ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తున్నాయని అన్నారు.
ప్రాజెక్టులు పేరుతో దోపిడీ…
సాగునీటి ప్రాజెక్టుల పేరుతో నిధుల దోపిడీ జరుగుతోందని గుజ్జుల ఈశ్వరయ్య ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు కాలేదని, ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో రైతులకు లాభం లేకపోతుందని అన్నారు. చిన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేని పరిస్థితిలో భారీ ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.
దక్షిణాదిపై వివక్ష…
కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై స్పష్టమైన వివక్ష చూపుతోందని ఆయన అన్నారు. రాష్ట్రం నుంచి భారీగా పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ తిరిగి తక్కువ నిధులు మాత్రమే వస్తున్నాయని తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం అధిక నిధులు కేటాయించడం అన్యాయమని అన్నారు. ఈ విషయంపై రాష్ట్ర నాయకులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
డీలిమిటేషన్‌తో నష్టం…
డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని గుజ్జుల ఈశ్వరయ్య హెచ్చరించారు. జనాభా ఆధారంగా సీట్ల పెంపు చేస్తే ఉత్తరాది రాష్ట్రాలకు లాభం చేకూరుతుందని తెలిపారు. 2021లో జరగాల్సిన జనగణన ఇప్పటికీ పూర్తి కాలేదని కేంద్రాన్ని విమర్శించారు.
మహిళా బిల్లుపై రాజకీయాలు…
మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయ లాభాల కోసం వాడుకుంటున్నారని గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. నిజంగా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కులగణన అనంతరం ఎన్నికలు…
రాష్ట్రంలో కులగణన పూర్తి చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రజలు కమ్యూనిస్టు పార్టీలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్, ఉలవలపూడి రాము, బూదాల శ్రీనివాసరావు, మహంకాళి సుబ్బారావు, బి వెంకటేశ్వర్ రెడ్డి, సిపిఐ మండల కార్యదర్సులు వందనం, మల్లికార్జున, చీరాల అంజయ్య పాల్గొన్నారు.