వ్యవసాయం కుదేలు…ప్రచార ఆర్భాటంలో ప్రభుత్వాలు: సిపిఐ
రాష్ట్రంలో, దేశంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వినుకొండ లో ఆదివారం విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు.
వ్యవసాయం పూర్తిగా కుదేలైందని, రైతులకు ఆర్థిక ప్రోత్సాహం లేక, పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక, మద్దతు ధర కరువై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు.
కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇప్పటికే 151 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 31 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నికల ముందు రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామని గొప్పలు చెప్పిన పాలకులు, ఆచరణలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
అధికారంలోకి వస్తే సాగు సాయం కింద ఏటా రూ. 20 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వాలు, నాలుగు సీజన్లకు కలిపి ఆ రూ. 20 వేలు ఇచ్చారా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
ప్రభుత్వానిది “పని తక్కువ.. ప్రచారం ఎక్కువ” అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు. వాస్తవానికి రాజస్థాన్లో రోజువారీ కూలీకి ఉన్న పరిస్థితి కంటే ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు.
దీనికి తోడు మన రాష్ట్రంలో పండించే పంటలకు ఎలాంటి లబ్ధి చేకూరడం లేదని, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వ్యవసాయ ఉత్పత్తులకు మాత్రం “జీరో టాక్స్” విధానాన్ని అమలు చేస్తూ మోదీ సర్కార్ దేశ రైతాంగం నడ్డి విరుస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈశ్వరయ్య.