సాగునీటి ప్రాజెక్టులు పాలకుల ఏటీఎంలు…ఈశ్వరయ్య
– చంద్రబాబు మాయమాటలు: సిపిఐ
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిపై స్పందిస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మాయమాటలు చెప్పి ఒక్కదానిని కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు లేదని, పనులు నత్తనడకన సాగుతున్నాయని అన్నారు. “ఉట్టికి ఎగలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు” చిన్నదైన వరికపుడిశెల లాంటి ప్రాజెక్టునే చేపట్టలేని వారు, ఇక భారీ ప్రాజెక్టులను ఎలా పూర్తి చేస్తారని ఆయన ఎద్దేవా చేశారు. బనకచర్ల పేరుతో రూ. 81 వేల కోట్లు అని చెబుతున్నారని, ఇవి నిజమైన ప్రాజెక్టులు కావు సరికదా, కేవలం నిధులు దోపిడీ చేసుకోవడానికి ఏటీఎంలుగా మాత్రమే వాడుకుంటున్నారని ఆరోపించారు. వీరి తీరు చూస్తుంటే “ఎవరికో పుట్టిన బిడ్డకు ఎక్కిఎక్కి ఏడ్చినట్లు” ఉందని విమర్శించారు. ఒకవేళ తెలుగు గంగ, గండికోట లాంటి ప్రాజెక్టులు ఉన్నా వాటికి పంట కాలువలు లేవని, కాలువలే లేనప్పుడు ఆ ప్రాజెక్టుల వల్ల రైతులకు ఒరిగే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. కేవలం కమీషన్లు వచ్చే భారీ ప్రాజెక్టుల మీద ఉన్న దృష్టి, తక్కువ ఖర్చుతో పూర్తయ్యే చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల మీద ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయమన్నారు.
దక్షిణాదిపై కేంద్రం సవతి తల్లి ప్రేమ.. మోదీకి ప్రాంతీయ పార్టీల భజన…
కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై స్పష్టమైన వివక్ష చూపుతూ, చవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోందని ఈశ్వరయ్య దుయ్యబట్టారు. సగటున మన రాష్ట్రం నుంచి వెయ్యి రూపాయలు పన్నుల రూపంలో కేంద్రానికి వెళుతుంటే, తిరిగి మనకు కేవలం 43 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని గుర్తుచేశారు. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్‌కు రూ. 923, యూపీకి రూ. 1200 చొప్పున నిధులు విడుదల చేస్తున్నారని, ఇక్కడ పన్నులు వసూలు చేసి ఉత్తరాదిలో ఖర్చు చేస్తున్న మాట వాస్తవం కాదా? అని ఆయన నిలదీశారు. ఇంత ఘోరమైన అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గానీ, పవన్ కళ్యాణ్ గానీ ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఇంత జరుగుతుంటే 40 ఏళ్ల ఇండస్ట్రీ అని, విజనరీ నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబు, నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి కూడా నేడు మోదీకి భజన చేయడం దారుణమన్నారు. జగన్, బాబు, పవన్ లు ముగ్గురూ బీజేపీ పక్షమే వహిస్తున్నారని, కేవలం తమపై ఉన్న కేసులు, ఆదాయాల భజన కోసమే ఈ ప్రాంతీయ రాజకీయ పార్టీలు మోదీకి మద్దతు తెలుపుతున్నాయన్న వాస్తవాన్ని ప్రజలు గమనించాలని కోరారు.