మహిళా రిజర్వేషన్ బిల్లుపై అన్ని పార్టీలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. వినుకొండ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు.
గత 50 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ల కోసం సీపీఐ ఎంపీలు రేణు, గీతా ముఖర్జీలు చేసిన పోరాటం దేశమంతటికీ తెలుసునని, కానీ నేడు ఆ త్యాగం తమదేనని, పోరాటం చేశామని ఇప్పుడున్న పార్టీలు గొప్పలు చెప్పుకుంటున్నాయని ఈశ్వరయ్య అన్నారు.
2023లోనే 131వ సవరణ బిల్లుకు ఆమోదం లభించిందని, అలాంటప్పుడు ఇప్పుడు కొత్తగా మళ్లీ బిల్లు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.
ఈ బిల్లును 2029 లేదా 2034లో గానీ అమలు చేయరని, మోదీకి నిజంగా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడున్న 543 సీట్లలో 181 ఎంపీ సీట్లు మహిళలకు ఎందుకు కేటాయించడం లేదని నిలదీశారు.
మహిళా బిల్లుకు 230 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఉన్నా ఆ పార్టీలను పరిగణలోకి తీసుకోలేదని, కనీసం 69 మంది ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం మోదీకి తెలియదా అని ప్రశ్నించారు. పార్లమెంట్ సాక్షిగా మోదీకి ఘోర పరాభవం ఎదురైందని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని హెచ్చరించారు. దురుద్దేశంతో ప్రవేశపెట్టిన బిల్లు ఓడిపోవడంతో ఆ నెపాన్ని కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌పై మోపుతున్నారని విమర్శించారు.
ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారని, కేవలం తమిళనాడు, కేరళ, బెంగాల్ ఎన్నికల కోసమే కేంద్రం ఈ నాటకం ఆడుతోందని అభివర్ణించారు. దీనిపై కనీస అవగాహన లేక, బిల్లు చదువుకోకుండా జగన్, బాబు, పవన్ లు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించడానికి కేంద్రం కొన్నాళ్లు రామ మందిరం, కొన్నాళ్లు పుల్వామా ఘటన, మరికొన్నాళ్లు దేశభక్తి అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వాస్తవాలు తెలుసుకోకుండా మభ్యపెడుతోందని మండిపడ్డారు.
కులగణన జరిగే వరకూ ఎన్నికలొద్దు..
కమ్యూనిస్టుల పోరాటాలకు అండగా నిలవాలి
రాష్ట్రంలో మెజారిటీ కులాలకు సరైన అవకాశాలు దక్కడం లేదని, కాబట్టి తక్షణమే రాష్ట్రంలో జనాభా లెక్కలు, కులగణన పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ ప్రక్రియ పూర్తయిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు గానీ, డీలిమిటేషన్ అంశాన్ని గానీ తెరమీదకు తేవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేసిన విధంగానే, మండల్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన పట్టుబట్టారు. దేశంలో నెలకొన్న ప్రజా సమస్యలు, కేంద్ర విధానాలపై నిరసనగా ఈ నెల 24న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టనున్నట్లు ఈశ్వరయ్య ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు అన్నీ ఐక్యంగా పోరాడి, స్థానిక సంస్థల్లో తమ సత్తా చాటుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తున్నది, ప్రజల పక్షాన నిలబడుతున్నది కేవలం కమ్యూనిస్టులు మాత్రమేనని, ఈ వాస్తవాన్ని ప్రజలంతా గమనించి, కమ్యూనిస్టు పార్టీల ఉద్యమాలకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.