*తెలుగుదేశం మహానాడు రద్దు..?*
పొదుపు బాటలో కూటమి ప్రభుత్వం..
ఐటీ తరహాలో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ దిశగా అడుగులు!
అమరావతి :
భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ‘పొదుపు పిలుపు’ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనాలకు దారితీస్తోంది. అగ్రరాజ్యాల ఆర్థిక ఒడిదుడుకుల ప్రభావం మనపై పడకుండా ఉండాలంటే.. ప్రజలు ఇంధనం, బంగారం వాడకాన్ని తగ్గించుకోవాలని, అనవసరపు దుబారా ఖర్చులకు స్వస్తి పలకాలని ప్రధాని సూచించారు. ఈ క్రమంలోనే పాలకులే ఆదర్శంగా ఉండాలని భావించిన ప్రధాని, తన కాన్వాయ్‌ను సగానికి తగ్గించుకున్నారు.
ప్రధాని బాటలోనే నడుస్తూ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కూడా సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే నెల్లూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘తెలుగుదేశం మహానాడు’ రద్దు కాబోతోందన్న వార్తలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
*మంత్రివర్గ సమావేశంలో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ నిర్ణయం?*
ఈరోజు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కూటమి ప్రభుత్వం ఇంధన పొదుపు దిశగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
*వర్క్ ఫ్రమ్ హోమ్*: ఇంధన వృథాను అరికట్టేందుకు ఐటీ రంగం తరహాలో ప్రభుత్వ శాఖల్లో కూడా సాధ్యమైన చోట ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
కాన్వాయ్‌ల కోత: ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ కాన్వాయ్‌లలోని వాహనాల సంఖ్యను 50% పైగా తగ్గించుకుని పొదుపును ఆచరణలో చూపిస్తున్నారు.
ప్రజా ప్రతినిధుల బాధ్యత: మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అనవసరపు ప్రయాణాలను తగ్గించుకుని వర్చువల్ మీటింగ్స్ ద్వారానే పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు.
*మహానాడు నిర్వహణపై సందిగ్ధత!*
నెల్లూరులో మహానాడు నిర్వహణ కోసం ఇప్పటికే పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశాయి. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో మహానాడు నిర్వహించడంపై పార్టీ నాయకత్వం పునరాలోచనలో పడింది.
*ఇంధన పొదుపు:* మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది వాహనాల్లో లక్షలాది మంది కార్యకర్తలు తరలివస్తారు. దీనివల్ల భారీగా ఇంధనం ఖర్చవుతుంది. ఇది ప్రధాని ఇచ్చిన పిలుపునకు విరుద్ధంగా ఉంటుందని అధిష్టానం భావిస్తోంది.
దుబారా ఖర్చుల కట్టిడి: ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని ప్రజలకు చెబుతున్న వేళ, పార్టీ పండుగ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం సరైన సంకేతం కాదని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
చారిత్రాత్మక నిర్ణయం: ఒకవేళ మహానాడు రద్దయితే, దేశ ప్రయోజనాల కోసం తన సొంత పార్టీ వేడుకను త్యాగం చేసిన తొలి నాయకుడిగా చంద్రబాబు నిలుస్తారు.
ప్రజల్లోకి బలమైన పొదుపు సందేశాన్ని పంపేందుకు, కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో వేచి చూడాలి. ఏది ఏమైనా, ‘పొలిటికల్ టెంపర్’ అంచనా ప్రకారం.. అధికార యంత్రాంగంలోనూ, పార్టీ వ్యవహారాల్లోనూ ఈ ‘పొదుపు విప్లవం’ పెద్ద మార్పులకే దారితీస్తోంది.
ఓవైపు తాము పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నామని ప్రధానమంత్రి సూచనలు అమలు చేస్తున్నామని చెప్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు కొనసాగించే దిశగా ముందుకు వెళితే ప్రతిపక్షాలు తమను టార్గెట్‌గా చేసే అవకాశం లేకపోలేదని ముందుగానే పసిగట్టినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే మహానాడు ను రద్దు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే మహానాడు విషయంపై తెలుగుదేశం పార్టీ నాయకత్వం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
*పొలిటికల్ టెంపర్ బ్యూరో*