ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో అటు సినిమా గ్లామర్, ఇటు రాజకీయ చైతన్యం కలగలిసిన అరుదైన వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్. అయితే, ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ సృష్టించిన సంచలనం, ఏపీలో సరికొత్త చర్చకు దారితీసింది. పవన్ కళ్యాణ్ 2008లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుండి నేటి జనసేన వరకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. నాాడు ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 స్థానాలకే పరిమితమై, చివరకు కాంగ్రెస్‌లో విలీనం కావడం పవన్‌ను ఎంతగానో కలచివేసింది. ఆ ఆవేదన నుండే పుట్టిన జనసేన, 2019లో విలువల రాజకీయాల కోసం ఒంటరిగా పోరాడి ఓటమి పాలైంది. ఆ ఓటమి నేర్పిన గుణపాఠంతోనే 2024 ఎన్నికలకు ముందు పవన్ ఒక కీలక సత్యాన్ని గ్రహించారు. రాష్ట్రంలో కమ్మ, కాపు సామాజిక వర్గాలను ఏకం చేస్తేనే అధికారం సాధ్యమని భావించి, తన వ్యక్తిగత ఆశయాలను పక్కన పెట్టి టీడీపీ, బీజేపీలతో కూటమి కట్టారు. జగన్మోహన్ రెడ్డిని అధికారానికి దూరం చేయాలన్న శపథంతో చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపిన పవన్, కేంద్రంలోని బీజేపీ మద్దతు కూడా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని నమ్మారు.
కానీ, అధికారం దక్కిన తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవల తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన వేదికపై, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు జనసైనికులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి. “రాబోయే ముఖ్యమంత్రి కూడా తెలుగుదేశం పార్టీ నుండే ఉంటారు” అని పల్లా ప్రకటించడం, భవిష్యత్తు సీఎం నారా లోకేష్ అనే అర్థాన్ని ధ్వనించింది. ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన తన పార్టీ పట్ల విధేయత చాటుకోవడంలో తప్పులేకపోయినా, పొత్తులో ఉన్న భాగస్వామ్య పక్షంగా జనసేన ఉనికిని విస్మరించడంపై నిశ్శబ్దంగా చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పదేపదే “కూటమి 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుంది, పొత్తు ధర్మానికి కట్టుబడి ఉండాలి” అని చెబుతుండటం, అభిమానుల్లో ఒక రకమైన సందేహాన్ని రేకెత్తిస్తోంది. తమ నాయకుడికి ముఖ్యమంత్రి పదవిపై ఆశ లేదా? లేక అనుభవం కోసం ఆయన ఎదురుచూస్తున్నారా? అని సగటు అభిమాని మథనపడుతున్నాడు.
సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని ‘పవర్ స్టార్’ గా నిలిచిన పవన్, రాజకీయాల్లో ఎందుకు సీఎం కాకూడదన్నది అభిమానుల ప్రశ్న. పొత్తుల కారణంగా జనసేన ఎదుగుదల కుంటుపడుతోందని, కేవలం టీడీపీ జెండాలు మోయడానికే తాము పరిమితం అవుతున్నామని క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. రాజకీయ అనుభవజ్ఞులు 2024లో ఒంటరిగా పోటీ చేయమని సూచించినా, పవన్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే మొగ్గు చూపారు. అయితే, తమిళనాడులో విజయ్ మాదిరిగా పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడు సొంతంగా అధికారాన్ని కైవసం చేసుకుంటారా అని కాపు సామాజిక వర్గం, అభిమానులు నిరీక్షిస్తున్నారు. ఒకవేళ పవన్ కూటమి నుండి వైదొలిగితే ప్రభుత్వాల తలరాతలు మారుతాయన్నది జగమెరిగిన సత్యం. అందుకే చంద్రబాబు నాయుడు నిత్యం పవన్‌తో టచ్‌లో ఉంటూ, ఆయనకు వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకుండా మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజారాజ్యం నాటి నుండి నేటి వరకు తమ నాయకుడిని సింహాసనంపై చూడాలన్న అభిమానుల కల నెరవేరే రోజు ఎప్పుడు వస్తుందో కాలమే సమాధానం చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో మాదిరిగానే రాజకీయాల్లోనూ పవన్ తన ప్రభావాన్ని చాటుతూ, అభిమానుల ఆశయాలకు అనుగుణంగా ఎప్పటికైనా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తారని పవన్ అభమానులు ఆశిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలకు పవనే “దశ -దిశ”అన్నట్లు పరిస్థితులు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.