హైదరాబాద్ శివార్లలోని గండిపేట భూవివాదం పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో తీవ్ర సంచలనం రేపింది. వినుకొండ మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లా బ్రహ్మనాయుడుపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయడంతో స్థానిక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇన్నాళ్లూ నియోజకవర్గ పరిధికే పరిమితమైన రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు ఇప్పుడు ఏకంగా పొరుగు రాష్ట్రంలో నమోదైన కేసుల చుట్టూ తిరుగుతుండటం పల్నాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్‌లో కేసు.. వినుకొండలో మొదలైన బాధితుల ప్రెస్ మీట్లు!
గండిపేట భూఆక్రమణల ఉదంతం వెలుగుచూసిన మరుసటి రోజు నుంచే వినుకొండ నియోజకవర్గంలోనూ బొల్లా బ్రహ్మనాయుడుకు వ్యతిరేకంగా పలు భూకబ్జా ఆరోపణలు వేగంగా తెరపైకి రావడం గమనించాల్సిన విషయం. గతంలో తమ భూములను బొల్లా ఆక్రమించారని, తమకు రిజిస్ట్రేషన్ చేయాల్సిన భూములను అధికార బలంతో వేరొకరి పేరిట బదలాయించారని ఆరోపిస్తూ పలువురు బాధితులు వరుస పెట్టి ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ, బాధితులు బహిరంగంగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్నప్పటికీ… ఇన్నాళ్లూ ఈ బాధితులంతా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు బొల్లాపై హైదరాబాద్‌లో కేసు నమోదు కాగానే ఒక్కసారిగా ఎందుకు బయటకు వచ్చారనేది నియోజకవర్గంలో అంతర్గతంగా నడుస్తున్న అత్యంత ఆసక్తికరమైన చర్చ.
సోషల్ మీడియాలో ‘కూటమి’ వ్యూహాలు.. రక్షణలో వైసీపీ!
బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు నమోదు కాగానే తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారానికి తెరలేపాయి. “బొల్లా రాజకీయ ప్రస్థానం ముగిసింది” అంటూ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పోస్టులతో సామాజిక మాధ్యమాలను హోరెత్తిస్తున్నారు.
మరోవైపు వైసీపీ ముఖ్య నేతలు ఈ ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. బొల్లా బ్రహ్మనాయుడు ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని, ఆయన రాజకీయ నిబద్ధత, నిజాయితీ కలిగిన వ్యక్తి అని గట్టిగా సమర్థిస్తున్నారు. దీనిపై కూటమి నేతలు నిరసన ప్రశ్నలు గుప్పిస్తున్నారు. అంత నిజాయితీ ఉన్న వ్యక్తి అయితే పోలీసుల విచారణకు ఎందుకు సహకరించలేదని, ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురయ్యాక పోలీసులకు లొంగిపోకుండా తమిళనాడులోని కాంచీపురంలో ఎందుకు దాక్కోవాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

నేత లేకపోయినా సక్సెస్…
ఈ రాజకీయ ఉత్కంఠ పతాక స్థాయికి చేరిన తరుణంలోనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు జూన్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా “వెన్నుపోటుకు రెండేళ్లు” అనే నిరసన కార్యక్రమాన్ని తలపెట్టారు. వినుకొండ నియోజకవర్గంలో ప్రధాన నేత బొల్లా బ్రహ్మనాయుడు అందుబాటులో లేకపోయినప్పటికీ, మండల స్థాయి ద్వితీయ శ్రేణి నాయకుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది. గ్రామాల నుండి భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో కార్యక్రమానికి ఊహించని స్థాయిలో స్పందన రావడం స్థానిక రాజకీయ సమీకరణాల్లో గమనించాల్సిన కీలక పరిణామం.
కేసు అసలు కథేంటి? సివిల్ వివాదమా.. క్రిమినల్ నేరమా?
ఈ నేపథ్యంలో తమిళనాడులోని కాంచీపురంలో బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ కావడం ఆయన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసింది. ఈ కేసు అసలు సివిల్ పరిధిలోకి వస్తుందా లేదా క్రిమినల్ కేసుగా మారుతుందా అనే చట్టపరమైన కోణాన్ని పరిశీలిస్తే.. అధికారిక రికార్డులు భిన్నమైన వాస్తవాలను చూపుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగి పోలీస్ స్టేషన్లో గండిపేట మండలం తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మే నెలలో ఈ కేసు నమోదైంది. గండిపేట గ్రామంలోని సర్వే నంబర్ 18లో ఉన్న సుమారు 10 ఎకరాల ప్రభుత్వ పొరంబోకు భూమిని ప్రైవేటు వ్యక్తులకు కేటాయించినట్లుగా 5 నకిలీ జీవోలను (Fake GOs) సృష్టించి, తప్పుడు పత్రాలతో కబ్జా చేయడానికి ప్రయత్నించారన్నది పోలీసుల ప్రాథమిక దర్యాప్తు సారాంశం.
బొల్లా వాదన వర్సెస్ పోలీస్ ఆధారాలు:
ఈ కేసులో బొల్లా బ్రహ్మనాయుడును పోలీసులు ఏ7 (7వ నిందితుడు)గా చేర్చారు. సదరు భూమి ఒప్పంద పత్రాలలో ఎక్కడా తన పేరు లేదని బొల్లా చెప్తున్నప్పటికీ, పోలీసులు సాంకేతిక ఆధారాలను తెరపైకి తెచ్చారు. వివాదాస్పద భూమి ఒప్పందంలో భాగంగా బొల్లా ఖాతా నుండి నిందితుల్లో ఒకరైన రాంస్వామి ఖాతాకు సుమారు రూ. 1.25 కోట్ల నుండి 4 కోట్ల వరకు ముందస్తు ఒప్పంద రూపంలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు బ్యాంక్ రికార్డుల ద్వారా నిర్ధారించారు.
సివిల్ నుండి క్రిమినల్‌గా మారిన కేసు:…..
నిజానికి ఈ భూమిపై నిమ్మల కుటుంబం 2012 నుండి కోర్టును ఆశ్రయించగా, హైకోర్టు అక్టోబర్ 2025లోనే ఆ క్లెయిమ్‌ను కొట్టివేసి అది ప్రభుత్వ భూమేనని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు తర్వాత కూడా నకిలీ జీవోల ఆధారంగా విక్రయ ఒప్పందాలు చేసుకోవడం, ల్యాప్‌టాప్‌లు, వాట్సాప్ వేదికగా నకిలీ పత్రాలు పంపడం వంటి డిజిటల్ ఆధారాలు లభించడంతో పోలీసులు దీనిని కేవలం సివిల్ వివాదంగా కాకుండా..ఫోర్జరీ, క్రిమినల్ కాన్స్పిరసీ (నేరపూరిత కుట్ర), ల్యాండ్ గ్రాబింగ్ (భూ ఆక్రమణ) కింద తీవ్రమైన క్రిమినల్ కేసుగా నమోదు చేశారు.
మారుతున్న సమీకరణాలు.. బొల్లా రాజకీయ భవిష్యత్తు ఎటువైపు?
ప్రస్తుతం అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీల మధ్య వినుకొండ వేదికగా తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. బొల్లా బ్రహ్మనాయుడు జైలు నుండి ఎప్పుడు బయటకు వస్తారు? కేసు దర్యాప్తు ఎక్కడి దాకా వెళ్తుంది? అనే అంశాలే ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తును నిర్ధారించనున్నాయి. మరోవైపు, ఈ సంక్షోభ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు ఏ మేరకు అండగా నిలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో బొల్లా బ్రహ్మనాయుడు నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కొందరు సొంత పార్టీ (వైసీపి) నేతలు, ప్రస్తుతం మారుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. బొల్లాపై నమోదైన ఈ ఫోర్జరీ కేసు చట్టపరంగా ఆయన మెడకు చుట్టుకుంటే, ఆయన రాజకీయ ప్రస్థానం ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు. దీన్ని ముందే ఊహించిన కొందరు వైసీపీ ముఖ్య నేతలు, వినుకొండ నియోజకవర్గంలో తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరుతూ ఇప్పటికే అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద అర్జీలు పెట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తానికి, ఇటు వినుకొండలోనే కాక పల్నాడు జిల్లావ్యాప్తంగా మరియు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బొల్లా బ్రహ్మనాయుడు గండిపేట వ్యవహారం ముందు ముందు ఏ రకమైన రాజకీయ మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి!
– ఎడిటర్, పొలిటికల్ టెంపర్