- వినుకొండ వైసీపీలో“గిరి”యాక్టివ్ కాబోతున్నారా?
వినుకొండ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే, పార్టీ పీఏసీ సభ్యులు బొల్లాబ్రహ్మనాయుడు గండిపేట భూ వ్యవహారంలో పోలీసులు అరెస్టు చేయటంతో ఇప్పుడు వినుకొండ రాజకీయాల్లో ఆసక్తికర చర్చనడుస్తోంది. వినుకొండ నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిని నియమిస్తారన్న చర్చనడుస్తోంది. అయితే బొల్లా బ్రహ్మనాయుడు వైసీపీ అధినేత పట్ల ఎంతో విధేయతతో ఉన్నారని, ఆయనను కాదని వినుకొండలో కొత్త వ్యక్తిని తెరమీదకు తెచ్చే అవకాశం లేదన్న వాదన పార్టీ ముఖ్య నాయకుల నుండి వినిపిస్తున్న సమాచారం. ఇదిలా ఉంటే బొల్లా బ్రహ్మనాయుడు కేసు తీవ్రతను బట్టి కేసులో బ్రహ్మనాయుడు ప్రమేయం లేదని కోర్టు బెయిల్ ఇస్తే ఇక ఎప్పటిలాగే ఆయన వినుకొండ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారు.
ఒకవేళ బొల్లా రానున్న రోజుల్లో కేసును దీర్ఘకాలం ఎదుర్కోవాల్సి వస్తే… బొల్లాపై అధిష్ఠానం ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. అయితే తొలుత బొల్లా బ్రహ్మనాయుడు కేసు వ్యవహారం తేలేవరకు, లేదా కేసు విచారణలు పూర్తయ్యే వరకు వినుకొండ నియోజకవర్గంలో వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు అండగా ఉండేందుకు, పార్టీ కార్యక్రమాలను నిర్వహించేందుకు బొల్లా బ్రహ్మనాయుడు తనయుడు బొల్లా గిరిబాబు వినుకొండ రాజకీయాల్లో తెరపైకిరాబోతున్నారన్నది విశ్వసనీయ సమాచారం. తన తండ్రిని అక్రమంగా కేసులు ఇరికించారని, వివాదానికి కారణమైన భూమి కొనుగోలు ఒప్పంద అగ్రిమెంటులో తన తండ్రి
పేరు లేకుండా ఎలా నిందితుడు అవుతాడని బొల్లా గిరి ఇప్పటికే ప్రశ్నించారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, తన తండ్రి ఎలాంటి తప్పు చేయలేదని, చేయబోడని, ప్రజల కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి బొల్లా బ్రహ్మనాయుడు అని ప్రత్యేకంగా వీడియో కూడా సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ నేపధ్యంలో బొల్లా బ్రహ్మనాయుడు కేసు వ్యవహారం ఏ టర్న్ తీసుకున్నా, బొల్లా గిరి వినుకొండ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే అవకాశం ఉందని వైసీపీ రాష్ట్ర నాయకత్వం కూడా ఆ దిశగానే మొగ్గుచూపే అవకాశాలున్నాయన్నది స్పష్టం. బొల్లా బ్రహ్మనాయుడు పై కేసు తీవ్రరూపం దాల్చటం, ఆ ప్రభావం పార్టీపై పడే అవకాశం ఉంటే మాత్రమే వినుకొండ వైసీపీకి కొత్త వ్యక్తిని పరిశీలించే అవకాశం ఉంటుందన్నది రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ.