ప్రశ్నిస్తే… నిందలు వేస్తారా…?
కూటమి కొంప ముంచుతున్న మంత్రి వైఖరి?
పొలిటికల్ టెంపర్, అమరావతి :
ప్రజాస్వామ్యంలో సమస్యలు ఎదురైనప్పుడు బాధిత వర్గాలు రోడ్డెక్కి గళమెత్తడం సహజం. కడుపు మండినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మాట్లాడే మాటలు సహజంగానే కాస్త ఘాటుగా ఉంటాయి. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వం పెద్ద మనసుతో, సహృదయంతో సమస్యల తీవ్రతను అర్థం చేసుకుని పరిష్కార మార్గాలపై దృష్టి సారించాలి. అయితే, ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యవహరిస్తున్న తీరు అందుకు భిన్నంగా ఉంటూ విమర్శలకు తావిస్తోంది. ఇటీవల దస్తావేజు లేఖరులు తమ ఉపాధిని, వృత్తిని కాపాడాలంటూ ‘పెన్ డౌన్’ నిరసన చేపడితే… ఆ సమ్మె వెనుక వైఎస్సార్సీపీ ఉందంటూ ఆయన కొట్టిపారేశారు. మంత్రి వ్యాఖ్యలు కూటమినితాజాగా ఉద్యోగ సంఘాల నాయకులు తమ న్యాయమైన సమస్యలపై మాట్లాడితే, వారు ‘పొలిటికల్ అజెండా’తో మాట్లాడుతున్నారంటూ ఏకంగా ఉద్యోగ సంఘ నేతలను డైరెక్ట్‌గా టార్గెట్ చేయడం వివాదాస్పదమైంది. హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై ప్రతిపక్ష ముద్ర, స్వార్థ రాజకీయం అంటూ విమర్శలు గుప్పించడం సమస్యను పరిష్కరించకపోగా, ఉద్యోగ, కార్మిక వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. ఇలాంటి దూకుడు వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి మేలు చేస్తున్నాయో లేక నష్టం చేకూరుస్తున్నాయో ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అంటూ పొలిటికల్ విశ్లేషకులు ఘాటుగా స్పందిస్తూన్నారు.