కుప్పంలో పొలిటికల్ హీట్…
‘చంపడానికైనా చావడానికైనా సిద్ధం’..
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భరత్ వివాదాస్పద వ్యాఖ్యలు!
కుప్పం:
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య రాజకీయ పోరు మరింత రాజుకుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కేజే భరత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
కార్యకర్తల అంతర్గత సమావేశంలో ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ.. పార్టీ కోసం గట్టిగా నిలబడే వారికే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. “ఎవరినైతే అభ్యర్థిగా ఎంపిక చేయబోతున్నామో, వారు వైఎస్సార్సీపీ కోసం చంపడానికైనా, చావడానికైనా సిద్ధంగా ఉండాలి. అలాంటి ధైర్యమున్న క్యాండిడేట్లను మనం రంగంలోకి దించాలి” అని ఆయన పేర్కొన్నారు. అధికారంలో ఉన్న టీడీపీ నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినా, పోలీసులు లేదా ఇతర శాఖల అధికారులు ఇబ్బందులు పెట్టినా ఒక్క నామినేషన్ కూడా ఉపసంహరించుకోకుండా పోరాడేవారికే ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. స్థానిక పంచాయతీలు, వార్డులు, మున్సిపాలిటీల్లో ఇలాంటి అభ్యర్థులను నిలబెడితే ఎన్నికల్లో సగం విజయం సాధించినట్లేనని ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
నాలుగు మండలాల్లో టీడీపీ ఫిర్యాదులు…
ఎమ్మెల్సీ భరత్ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సమాజంలో హింసను ప్రేరేపించేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా భరత్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ కుప్పం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లోని పోలీస్ స్టేషన్లలో టీడీపీ నేతలు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రక్తాభిషేకం చేసి గెలుస్తామంటూ ప్రతిపక్షాలు రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నాయని, తాము మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తామని టీడీపీ శ్రేణులు హెచ్చరించాయి.
భరత్ రాజకీయ నేపథ్యం.. గత స్థానిక సమరంలో వైసీపీ హవా!
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కే. చంద్రమౌళి కుమారుడైన కేజే భరత్, తండ్రి మరణానంతరం కుప్పం నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. 2021లో చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన, కుప్పంలో పార్టీని నడిపించే పూర్తి బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు.
గత 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బలం తోడవ్వడంతో కుప్పం గడ్డపై వైసీపీ అనూహ్య విజయాలు సాధించింది. నియోజకవర్గంలోని 89 గ్రామ పంచాయతీల్లో 70కి పైగా సర్పంచ్ స్థానాలను, 4 జడ్పీటీసీలను (కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం) క్లీన్ స్వీప్ చేయడంతో పాటు, మొట్టమొదటిసారి జరిగిన కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులకు గాను 19 వార్డులను దక్కించుకుని టీడీపీ కంచుకోటను బద్ధలు కొట్టింది. ఈ ఫలితాలతోనే అప్పట్లో వైఎస్సార్సీపీ అధిష్ఠానం ‘వై నాట్ కుప్పం’ అనే నినాదాన్ని బలంగా వినిపించింది.
కుప్పంపై వైసీపీకి పట్టుందా? భరత్ వ్యూహం ఫలించేనా?అయితే, 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి కుప్పంలో రాజకీయ సమీకరణాలు సమూలంగా మారిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 48,000 ఓట్లకు పైగా భారీ మెజారిటీతో భరత్‌పై గెలుపొందడంతో పాటు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో కుప్పంలో అధికారం కోల్పోయిన వైఎస్సార్సీపీ కేడర్ తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయింది. చాలామంది నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడటం లేదా స్తబ్దుగా మారిపోవడం భరత్‌కు పెద్ద సవాలుగా మారింది.గత స్థానిక ఎన్నికల్లో అధికారంలో ఉండటం వల్ల దక్కిన ఏకపక్ష విజయాలు.. ఇప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు పునరావృతం కావడం అంత సులువు కాదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. పోలీసుల ఒత్తిళ్లు, అధికార పక్షం దూకుడు ఉంటాయన్న భయంతో అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి కూడా వెనుకాడే పరిస్థితి నెలకొంది. ఈ సంక్షోభాన్ని అధిగమించి, శ్రేణుల్లో పోరాట పటిమను రగిల్చేందుకే భరత్ “చంపడానికైనా.. చావడానికైనా” అంటూ తీవ్రమైన స్వరం వినిపించినట్లు కనిపిస్తోంది. కానీ, విపక్ష హోదాలో ఉన్న భరత్ కేవలం దూకుడు వ్యాఖ్యలతో కేడర్‌లో ధైర్యం నింపి కుప్పంపై మళ్లీ వైసీపీ పట్టును నిరూపించుకోగలరా? లేక ఈ వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీని మరింత ఇరుకున పెడతాయా? అనేది రాబోయే స్థానిక ఎన్నికలే తేల్చనున్నాయి.