ఏపీలో 22A భూములపై కూటమి సర్కార్ కీలక నిర్ణయం….
జీవో 444, 445 జారీ.. నిబంధనలు అతిక్రమిస్తే అధికారులపై చర్యలు తప్పవు!
ఆంధ్రప్రదేశ్‌లో భూ యజమానులను వేధిస్తున్న సెక్షన్ 22A నిషేధిత భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలతో జీవో నం. 444, 445లను విడుదల చేసింది. ప్రైవేటు భూములను సరైన ఆధారాలు లేకుండా అక్రమంగా 22A జాబితాలో చేరిస్తే సంబంధిత రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. కొత్త నిబంధనల ప్రకారం ప్రైవేటు భూమిని నిషేధిత జాబితాలో పెట్టాలంటే అది ప్రభుత్వ భూమి అని నిరూపించాల్సిన బాధ్యత సదరు అధికారిపైనే ఉంటుందని (జీవో 445), అదే సమయంలో అర్హమైన భూములను 22A నుంచి సులభంగా తొలగించేందుకు కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని (జీవో 444) వెల్లడించారు. అలాగే నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతినిస్తూ, గతంలో అక్రమాలు జరిగిన 4 లక్షల ఎకరాలపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. రికార్డుల భద్రత కోసం బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని అమలు చేస్తూ రీ-సర్వే పనులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.