జీవో-396పై 12 రోజుల పోరాటానికి తాత్కాలిక విరామం…
ఆగస్టు 1 నుంచి విధుల్లోకి దస్తావేజు లేఖర్లు
అమరావతి: జీవో-396కి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు చేపట్టిన 12 రోజుల ‘పెన్ డౌన్’ ఉద్యమానికి తాత్కాలికంగా తెరపడింది. ఈనెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద నిర్వహించిన ఈ నిరసనలో దస్తావేజు లేఖర్లు, వారి సహాయకులు, వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు ఐక్యంగా పాల్గొని ప్రభుత్వ దృష్టిని ఆకర్షించారు. ఈ ఉద్యమానికి రైతులు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించడం విశేషం. భూముల హక్కులు, రిజిస్ట్రేషన్ వ్యవస్థ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ లేఖర్లకు మద్దతుగా నిలిచారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెనుమాక వెంకట సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి దాసరి సుధాకర్, కోశాధికారి అవ్వారు సత్యనారాయణ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. సంఘం పిలుపు మేరకు 12 రోజుల పాటు విజయవంతంగా పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి దస్తావేజు లేఖరి, సహాయకుడు, వెండర్, డీటీపీ ఆపరేటర్‌కు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కంకిపాడు సీనియర్ లేఖరి యలమంచిలి కిషోర్‌బాబు ఆధ్వర్యంలో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడం ఉద్యమానికి కీలక మలుపుగా నిలిచిందని పేర్కొన్నారు.
హైకోర్టులో కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కోరగా, కోర్టు అందుకు అవకాశం కల్పించిందని సంఘం తెలిపింది. ఈ పరిస్థితుల్లో కోర్టు విచారణ పెండింగ్‌లో ఉన్న సమయంలో నిరసన కార్యక్రమాలను కొనసాగించడం వల్ల ఆశించిన ప్రయోజనం ఉండకపోవచ్చని రాష్ట్రవ్యాప్తంగా సభ్యుల అభిప్రాయాలను సేకరించినట్లు వెల్లడించింది. సభ్యుల ఏకాభిప్రాయం మేరకు పెన్ డౌన్ ఉద్యమాన్ని జూలై 31తో తాత్కాలికంగా ముగించి, ఆగస్టు 1 నుంచి తిరిగి రిజిస్ట్రేషన్ సేవలను కొనసాగించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది.
అయితే ఇది ఉద్యమానికి ముగింపు కాదని, కేవలం తాత్కాలిక విరామమేనని సంఘం స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలు, హైకోర్టులో దాఖలయ్యే కౌంటర్‌ను పరిశీలించిన అనంతరం అవసరమైతే మరింత ఉధృతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించింది. దస్తావేజు లేఖర్ల వృత్తి భద్రతకు ఎలాంటి ముప్పు వచ్చినా సంక్షేమ సంఘం అండగా నిలుస్తుందని నాయకత్వం భరోసా ఇచ్చింది. ఈ పోరాటానికి నైతిక మద్దతు తెలిపిన రైతులు, ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, తమ వృత్తి పరిరక్షణ కోసం అవసరమైతే మరోసారి రాష్ట్రవ్యాప్తంగా ఐక్య పోరాటానికి సిద్ధమేనని స్పష్టం చేసింది.