కేసీఆర్ మరమనిషిగా మారిపోయారు..
అందుకే యుద్ధం మొదలుపెట్టా
కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
మేడ్చల్/హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన తండ్రి, సోదరుడికి గట్టి షాక్ ఇస్తూ కొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. శనివారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆమె తన కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన (TRS) పేరును, జెండాను ఆవిష్కరించారు. పసుపు, ఆకుపచ్చ, నీలం రంగుల కలయికతో, మధ్యలో తెలంగాణ మ్యాప్‌పై TRS అని ఉన్న జెండాను ఆమె ఎగురవేశారు.

తెలంగాణలో మరో టీఆర్ఎస్ ఆవిర్భావం…
తెలంగాణ గడ్డపై మరో టీఆర్ఎస్ ఆవిర్భవించింది. ఉద్యమ కాలం నాటి సెంటిమెంట్‌ను, ఆ పేరులోని పవర్‌ను మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా కవిత ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసలైన ఆశయాలు పక్కన పడ్డాయని, ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని భావిస్తున్న వారందరినీ ఏకం చేసేందుకు ఈ తెలంగాణ రాష్ట్ర సేన వేదిక కానుంది. పాత టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్గా మారిన నేపథ్యంలో, మళ్లీ అదే పేరుతో (TRS) కవిత రంగంలోకి దిగడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్ పోరు ఏ మలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
తండ్రిపై నిప్పులు చెరిగిన కవిత
పార్టీ ఆవిర్భావం అనంతరం కవిత చేసిన ప్రసంగం అగ్నిపర్వతంలా విస్ఫోటనం చెందింది. ఆయన మారిపోయారు కాబట్టే నేను యుద్ధం మొదలుపెట్టా అని కవిత ఉద్వేగంగా అన్నారు. కేసీఆర్ రాజకీయ పరిణతి కోల్పోయారని, ఆనాటి కేసీఆర్ వేరు.. ఈనాటి కేసీఆర్ వేరు అని ఆమె ధ్వజమెత్తారు. ఆనాడు చేనేత కార్మికుల కోసం భిక్షాటన చేసిన కేసీఆర్ మన మనిషి.. కానీ ఈనాడు ఆయన మన మనిషి కాదు, ఒక మరమనిషి. ఆయన ఇప్పుడు గుంటనక్కలు, తోడేళ్ల చేతుల్లో బందీ అయ్యారు అని ఎద్దేవా చేశారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ సరిగ్గా పాలించలేదని, ఉద్యమకారులను విస్మరించారని ఆరోపించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని తాను ప్రశ్నించడమే తప్పయిందా అని నిలదీశారు. తప్పు చేయని తనను పార్టీ నుండి సస్పెండ్ చేసి, అవినీతి పందికొక్కులను పక్కన పెట్టుకున్నారని మండిపడ్డారు. ఇది ఆరంభం మాత్రమే.. ముందుంది ముసళ్ల పండుగ అని హెచ్చరించారు.
సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శల జడివాన
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై కూడా కవిత విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి కర్కోటకుడిలా వ్యవహరిస్తున్నారని, గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా ముఖ్యమంత్రి పట్టీపట్టనట్లు వ్యవహరించడం శోచనీయమని ఆరోపించారు. ఒక రాజకీయ నాయకుడిని అలా అనడం సరికాదు.. కానీ గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దునిద్ర పోతుంటే నేను ఇంత కఠినంగా మాట్లాడాల్సి వస్తోంది అని వివరించారు. రాష్ట్రంలో పేదల ఇళ్లు కూలగొడుతుంటే పాలకులు ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు.
పంచజన్యం – కవిత ఐదు అస్త్రాలు
తెలంగాణ ప్రజలను తనవైపు తిప్పుకునేందుకు కవిత పంచజన్యం పేరుతో ఐదు కీలక హామీలను ప్రకటించారు:
విద్య: ప్రైవేట్ స్కూళ్లలోనూ పేదలకు పూర్తి ఉచిత విద్యను అందిస్తాం.
వైద్యం: ఏ రోగమైనా, ఏ ఆస్పత్రిలోనైనా సరే చిల్లిగవ్వ ఖర్చు లేకుండా ఉచిత వైద్యం.
వ్యవసాయం: రైతే రాజు అనే నినాదాన్ని క్షేత్రస్థాయిలో అక్షరాలా నిజం చేస్తాం.
ఉపాధి: అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.
సామాజిక న్యాయం: తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా బడుగు, బలహీన వర్గాల గొంతుకనై పోరాడతాం.
తాను కచ్చితంగా తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని, నిరుపేదల కోసం పోరాటం చేస్తానని కవిత ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు బంజారాహిల్స్‌లోని నివాసం నుండి అమరవీరుల స్తూపం వరకు భారీ ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు.