జర్నలిస్ట్ లకు రైల్వే ప్రయాణంలో రాయితీ కల్పించండి: ఎంపీ అవినాష్ రెడ్డి
పొలిటికల్ టెంపర్, ఆంధ్రప్రదేశ్ :
గుర్తింపు పొందిన జర్నలిస్టులకు గతంలో అందించిన రైల్వే ప్రయాణ రాయితీ (కన్సెషన్)ను తక్షణమే పునరుద్ధరించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆయన ఒక లేఖ రాశారు. 1950ల నుంచి అమల్లో ఉన్న ఈ రాయితీ విధానం, 2009లో ఫోటో ఐడీ ఆధారిత వ్యవస్థగా, 2010లో కుటుంబ సభ్యులకు విస్తరణతో పాటు 2016 నుంచి ఐఆర్సిటిసి (IRCTC) ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం వరకు నిరంతరం అందుబాటులో ఉండేదని ఎంపీ గుర్తుచేశారు.
అయితే, 2020లో కోవిడ్ విజృంభణ సమయంలో నిలిపివేసిన ఈ సదుపాయాన్ని, సాధారణ రైలు సర్వీసులు ప్రారంభమైనప్పటికీ ఇంకా పునరుద్ధరించకపోవడం శోచనీయమన్నారు.
జర్నలిస్టుల సంక్షేమానికి, వారి వృత్తిపరమైన ప్రయాణాలకు ఈ కన్సెషన్ ఎంతో తోడ్పడుతుందని పేర్కొంటూ, ప్రాధాన్యత ప్రాతిపదికన ఈ రైల్వే రాయితీని పునరుద్ధరించాలని కేంద్ర రైల్వే మంత్రిని ఆయన కోరారు.