ఏటా 15% ఆస్తి పన్ను పెంపు జివోలను తక్షణమే రద్దు చేయాలి: సిపిఐ డిమాండ్
ప్రజలపై రూ.400 కోట్ల అదనపు భారం..
కూటమి ప్రభుత్వం హామీ నిలబెట్టుకోవాలి
ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ధ్వజం
అమరావతి: రాష్ట్రంలోని పట్టణ ప్రజలపై భారంగా మారిన ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానాన్ని, ఏటా 15 శాతం పన్ను పెంచే జివోలను తక్షణమే రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, పెంచిన ఇంటి పన్నులను తగ్గించాలని, లేనిపక్షంలో ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
జివోలు 197, 198లను ఉపసంహరించాలి…
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విధించిన షరతులకు తలొగ్గి గత వైసీపీ ప్రభుత్వం అద్దె విలువ ఆధారిత పన్ను స్థానంలో ఆస్తి విలువ ఆధారిత పన్నును ప్రవేశపెట్టిందని ఆయన విమర్శించారు. ఇందుకోసం 44/2020 చట్ట సవరణ చేసి, జివోలు 197, 198లను తీసుకువచ్చిందని గుర్తు చేశారు. గతంలో 5 లేదా 6 ఏళ్లకు ఒకసారి పన్నులు పెంచే ఆచారం ఉండేదని, కానీ వైసీపీ హయాం నుంచి ప్రతి ఏటా 15 శాతం పన్నులు పెంచుకుంటూ పోవడం వల్ల ఐదేళ్లలో పన్ను భారం రెట్టింపు అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇచ్చిన మాట తప్పిన కూటమి ప్రభుత్వం…
గత ఎన్నికల సమయంలో ప్రతి ఏటా 15 శాతం పన్ను పెంపు విధానాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని ఈ సందర్భంగా ఈశ్వరయ్య గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా, ఆ హామీ అమలుకు నోచుకోకపోవడం విచారకరమన్నారు. గత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలనే ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందని, ఇది ప్రజలను వంచించడమేనని దుయ్యబట్టారు.
పట్టణ ప్రజలపై తీవ్ర ప్రభావం…
2026 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చిన పన్నుల పెంపుతో రాష్ట్రంలోని 123 పట్టణాల్లో ఉన్న సుమారు 1.50 కోట్ల మంది ప్రజలపై రూ. 400 కోట్ల భారం పడుతోందని ఆయన వివరించారు. 2021 నుంచి ఇప్పటివరకు ఇంటి పన్నులు 130 శాతం పెరిగాయని, ఈ ఏడాది మాత్రమే 30 శాతం వరకు పెంపు జరిగిందని గణాంకాలతో వివరించారు. భూముల విలువను పెంచడం వల్ల పన్నులు కూడా అమాంతం పెరుగుతున్నాయని, అప్పులు చేసి ఇల్లు కట్టుకున్న సామాన్యులకు ఇది పెను శాపంగా మారిందని పేర్కొన్నారు.
తక్షణ చర్యలు తీసుకోవాలి….
చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే క్యాపిటల్ వేల్యూ చట్టం 44/2020ని, జివోలు 197, 198లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఏడాది ముగిసే వరకు ఇంటి పన్నులపై పెనాల్టీలు వేసే ప్రక్రియను నిలిపివేయాలని, పెంచిన పన్నులను తగ్గించి సామాన్యులకు ఊరట కలిగించాలని గుజ్జుల ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.