పార్టీ పెడతాడు అంట… సీఎం అవటానికి కాదంట..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుగులేని వ్యూహకర్తగా, దశాబ్దాల పాటు కీలక పరిణామాలను తెరవెనుక నడిపించిన సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏపీలో టీడీపీకి ఓటేస్తే లోకేశ్, వైసీపీకి ఓటేస్తే జగన్ సీఎం అవుతారని పేర్కొన్న ఆయన, ఈ రెండు కుటుంబాల ఆధిపత్యానికి చెక్ పెట్టేలా త్వరలోనే రాష్ట్రంలో ‘మూడో ప్రత్యామ్నాయ’ రాజకీయ వేదికను తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. అయితే, ఎందరో నాయకుల్లా పార్టీ పెట్టి తానే పీఠం ఎక్కాలనే ఆశ తనకు లేదని, తాను సీఎం రేసులో ఉండబోనని కుండబద్దలు కొట్టడం ఇక్కడ అసలైన ట్విస్ట్. ఆడిటర్‌గా, ఆర్థిక–రాజకీయ రంగాల్లో అపారమైన అనుభవం గడించిన విజయసాయిరెడ్డి.. తాను కేవలం ఒక మార్గదర్శకుడిగా మాత్రమే ఉంటూ, ఎలాంటి స్వార్థం లేకుండా బాగా చదువుకున్న విద్యావంతుడైన యువకుడిని సీఎం కుర్చీలో కూర్చోబెడతానని స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి అధికార చక్రం తిప్పి, రాజకీయాలలో ఆరితేరిన ఒక సీనియర్ నేత.. పార్టీని నిర్మిస్తూనే ముఖ్యమంత్రి పదవికి స్వచ్ఛందంగా దూరంగా ఉంటానని ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది.