వినాయక చవితి వేడుకలకు రాష్ట్ర పోలీసుల మార్గదర్శకాలు…
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
అమరావతి :
రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని రాష్ట్ర పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతే ధ్యేయంగా మండపాల నిర్వాహకులు పాటించాల్సిన కీలక నిబంధనలను ఉన్నతాధికారులు విడుదల చేశారు. మండపాలను కేవలం నిర్వాహకుల సొంత లేదా అనుమతి పొందిన స్థలాల్లోనే ఏర్పాటు చేయాలని, ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించేలా మండపాలు వేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. అలాగే ధ్వని కాలుష్యాన్ని నివారించేందుకు డీజే (DJ) సౌండ్ సిస్టమ్‌లపై పూర్తి నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు.
ఉత్సవాల నిర్వహణకు బాధ్యతాయుతమైన వ్యక్తులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఘర్షణలకు తావులేకుండా కమిటీ సభ్యులే పూర్తి బాధ్యత వహించాలని ఆదేశించారు. మండపాల వద్ద భక్తుల రక్షణ కోసం తప్పనిసరిగా సీసీ కెమెరాలు, మెరుగైన విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు, నిర్వాహకులే సొంతంగా సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో విగ్రహాల వద్ద నిరంతర కాపలా ఉండేలా చూసుకోవాలన్నారు. స్థానిక ప్రాంతాలకు కేటాయించిన పోలీస్ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ, పోలీసులకు సహకరించి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని రాష్ట్ర పోలీసు శాఖ కోరింది.